Farmer's Protest: మరో రైతు బలవన్మరణం, బీజేపీ నేతలకు లీగల్ నోటీసులు పంపిన పంజాబ్ రైతులు, డిమాండ్లు తీర్చకపోతే 26వ తేదీన ట్రాక్టర్లతో పెరేడ్‌ నిర్వహిస్తామని తెలిపిన రైతు సంఘాలు, జనవరి 4న మరోసారి కేంద్రంతో చర్చలు
Farmers' Protest (Photo Credits: ANI)

New Delhi, January 3: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు (New Farm Laws) వ్యతిరేకంగా చేస్తున్న రైతుల ఉద్యమాన్ని అవమానిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారంటూ ముగ్గురు బీజేపీ నేతలకు రైతులు లీగల్ నోటీసులు పంపించారు. తమ పరువుకు భంగం కలిగించేలా చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, రామ్ మాధవ్‌లకు (Giriraj Singh, Nitin Patel, Ram Madhav) అమృత్‌సర్‌లకు చెందిన జస్‌కరణ్ సింగ్, జలంధర్‌కు చెందిన రామ్‌కీ సింగ్, రణధావా, సంగ్రూర్‌కు చెందిన సుఖ్వీందర్ సింగ్‌లు నోటీసులు పంపారు. కాగా, నోటీసులు పంపిన రైతులకు అవసరమైన న్యాయ సహాయం అందించనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.

ఇదిలా ఉంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలు (Farmer's Protest) ఆదివారం నాటికి 39 వ రోజుకు చేరుకున్నాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పంటల మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. కాగా సోమవారం మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరపనుంది

ఈనెల 4న జరిగే చర్చల్లో ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చకపోతే 26వ తేదీన రిపబ్లిక్‌ దినోత్సవం రోజున ఢిల్లీ వైపు ట్రాక్టర్లతో పెరేడ్‌ (Tractors Pared) చేపడతామని 40 రైతు సంఘాల కూటమి ‘సంయుక్త కిసాన్‌ మోర్చా’హెచ్చరించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సానుకూల స్పందన రానందున తీవ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించింది. గణతంత్ర దినోత్సవం పెరేడ్‌ అనంతరం కిసాన్‌ పెరేడ్‌ పేరిట తమ ట్రాక్టర్ల ర్యాలీ ఉంటుందని రైతు నేత దర్శన్‌ పాల్‌ సింగ్‌ చెప్పారు. ఈ పెరేడ్‌ సమయం, మార్గాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు.

కొనసాగుతున్న రైతుల ఉద్యమం, 1300కు పైగా జియో సిగ్నల్‌ టవర్లను ధ్వంసం చేసిన ఆందోళనకారులు, రైతు సమస్యలు పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించిన అన్నా హజారే

ముందుగా ప్రకటించిన విధంగానే కేఎంపీ రహదారిపై ట్రాక్టర్‌ ర్యాలీ (Tractor Rally) 6న ఉంటుందనీ, రిపబ్లిక్‌ డే పెరేడ్‌కు ఇది రిహార్సల్‌ అని చెప్పారు. వచ్చేదఫా చర్చలపై ఆశతోనే ఉన్నామని, కానీ ఇప్పటివరకు జరిగిన పరిణామాలను చూస్తే ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందని రైతుసంఘ నేత అభిమన్యుకుమార్‌ తెలిపారు. తమ డిమాండ్‌ మేరకు సాగు చట్టాలు రద్దు చేయడం లేదా తమను బలవంతంగా ఖాళీ చేయించడం మాత్రమే ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్‌ అని రైతు నేతలు తేల్చి చెప్పారు.

తమ డిమాండ్లలో సగానికిపైగా ఆమోదం పొందాయని చెప్పడం అబద్ధమని స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ విమర్శించారు. చట్టాలు రద్దు చేసేవరకు నిరసనలు కొనసాగిస్తామన్నారు. శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించడం అందరి హక్కని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అందువల్ల తాము శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని మరోనేత బీఎస్‌ రాజేవల్‌ చెప్పారు.

ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్‌ వద్ద మరో రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం రాంపూర్‌ జిల్లా బిలాస్‌పూర్‌కు చెందిన సర్దార్‌ కశ్మీర్‌ సింగ్‌(75) శనివారం మొబైల్‌ టాయిలెట్‌లో ఉరి వేసుకుని తనువు చాలించారు. ఆయన వద్ద సూసైడ్‌ నోట్‌ లభించిందని పోలీసులు తెలిపారు.