Meghalaya Floods: మేఘాలయను అతలాకుతలం చేసిన వరదలు, విరిగిపడ్డ కొండ చరియలు, వేలాది మందికి కరెంట్ కట్, 10 మంది మృతి
సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు (Flosh Floods) 10 మంది మరణించారు. కుండపోత వానల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి.
Meghalaya, OCT 06: ఈశాన్య భారతంలోని కీలక రాష్ట్రమైన మేఘాలయను (Meghalaya Floods) భారీ వర్షాలు ముంచెత్తాయి. సౌత్ గారో హిల్స్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలకు (Flosh Floods) 10 మంది మరణించారు. కుండపోత వానల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయం అయ్యాయి. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సౌత్ గారో హిల్స్ జిల్లాలో కురుస్తున్న భారీ వానలకు గాసుపరా ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
హతియాసియా సోంగ్మాలో కొండచరియలు విరిగిపడి ఇళ్ల మీద పడ్డాయి. దీంతో ఏడుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గారో హిల్స్ లోని 5 చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వాటి ప్రభావంపై మేఘాలయ సీఎం కన్నాడ్ కె సంగ్మా (KA Sangma) సమీక్ష నిర్వహించారు. బాధితులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గాలింపు, సహాయక చర్యలు చేపట్టాయి.
గాసుపరా ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ వంతెన సైతం కొట్టుకుపోయింది. ఈ ప్రాంతంలో పలుమార్లు కొండచరియలు విరిగిపడటంతో దాలు నుంచి బాంగ్మారాకు రోడ్డు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గారో హిల్స్ లో వర్ష బీభత్సంపై ముఖ్యమంత్రి సంగ్మా ఆరా తీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ కుటుంబం చనిపోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వెంటనే ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి సంగ్మా. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో బెయిలీ బ్రిడ్జి టెక్నాలజీని ఉపయోగించి పునర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంగ్మా సూచించారు. ఈ విధానం ద్వారా రవాణాను వేగవంతం చేయాలని చెప్పారాయన.