2024 భారతదేశం ఎన్నికలు: శనివారం ఆరో విడత లోక్ సభ ఎన్నికలు, ఈ సారి బరిలో కీలక నేతలు, బీహార్ సహా ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్
New Delhi, May 24: శనివారం లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ (Phase 6 Polling) జరగనుంది. ఈ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరో విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ (Lok Sabha Elections) ముగిసిపోగా ఇప్పుడు ఆరో విడతకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 1న జరిగే చివరి విడతతో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదల కానున్నాయి. ఆరో విడత పోలింగ్ జరగనున్న రాష్ట్రాల జాబితాలో బీహార్ (Bihar), ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి. బీహార్‌లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్లో 1, జార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, యూపీలో 14, బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్‌లో మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. ఆరో విడతలో ఆ లోక్‌సభ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరో విడతలో వివిధ పార్టీల నుంచి కీలక అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాలకు ఆరో విడత ఎన్నికల్లోనే పోలింగ్ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసు, స్వాతి మాలివాల్‌పై దాడి లాంటి పరిణామాలు అక్కడి రాజకీయాలను వేడెక్కించాయి.
అందుకే ఆరో విడత లోక్‌సభ ఎన్నికలపై ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ నెలకొంది. న్యూఢిల్లీ నుంచి దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్ (Bansuri swaraj) బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమ్‌నాథ్ భారతితో తలపడనున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఈసారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది. కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ (Kannaih Kumar) బరిలోకి దిగగా, బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ (Manoj Tiwari) పోటీ చేస్తున్నారు.
యూపీలోని సుల్తాన్‌పూర్‌లో బీజేపీ తరపున మేనకాగాంధీ (maneka Gandhi) బరిలోకి దిగారు. సమాజ్‌వాది పార్టీ నుంచి రామ్ బువల్ నిషద్ బరిలో ఉన్నారు. ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ ఆజాంగఢ్ నుంచి బరిలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయం సాధించారు. ఈ సారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడన్న నమ్మకంతో ఉన్నారు.
ఒడిశాలోని పూరి నియోజకవర్గంలో బీజేపీ తరపున సంబిత్ పాత్ర (Sambit Patra) పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీజేడీ తరపున అరుప్ పట్నాయక్, కాంగ్రెస్ నుంచి జయ్ నారాయణ్ పట్నాయక్ బరిలో ఉన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు. కర్నాల్ నియోజకవర్గం నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. గుడ్గావ్‌లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్.. బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్‌తో తలపడుతున్నారు.