Madhya Pradesh Shocker: పక్క ఇంటి వ్యక్తిని భార్య గుట్కా అడిగిందని గొంతు కోసుకున్న భర్త, మద్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన

భార్య పొరుగింటి వ్య‌క్తిని గుట్కా అడిగింద‌ని.. ఆమె భ‌ర్త గొంతు, మ‌ణిక‌ట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాల‌పాలైన ఆ వ్య‌క్తి ప్రస్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

Representative Image (File Image)

Betul, Jan 16: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బేతుల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పొరుగింటి వ్య‌క్తిని గుట్కా అడిగింద‌ని.. ఆమె భ‌ర్త గొంతు, మ‌ణిక‌ట్టు కోసుకున్నాడు. తీవ్ర గాయాల‌పాలైన ఆ వ్య‌క్తి ప్రస్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

దారుణ ఘటన వివ‌రాల్లోకి వెళ్తే.. ఝల్లార్ వాసి అయిన శివరామ్ రాథోడ్ (35) తన భార్య పూజతో కలిసి నివసిస్తున్నాడు. అయితే గత మూడేళ్లుగా బేతుల్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం శివరామ్ భార్య పూజ తన పొరుగువారి నుంచి గుట్కా (పొగాకు) అప్పుగా తీసుకుంది. ఈ విష‌యం భ‌ర్త శివ‌రామ్‌కు తెలిసింది.

పొరుగింటి వ్య‌క్తిని భార్య గుట్కా అడిగింద‌ని.. గొంతు కోసుకున్న భ‌ర్త‌

గుట్కా కావాల‌ని త‌న‌ను అడ‌గొచ్చు క‌దా? అని పూజ‌ను భ‌ర్త నిల‌దీశాడు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో శివ‌రామ్ బ‌య‌ట‌కు వెళ్లి పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఇంటికి వ‌చ్చాడు. మ‌ళ్లీ భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. గొడ‌వ మ‌రింత తీవ్రం కావ‌డంతో స‌మీపంలో ఉన్న త‌న సోద‌రుడికి పూజ స‌మాచారం అందించింది.

పూజ సోద‌రుడు అక్క‌డికి చేరుకుని పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. పోలీసులు చేరుకునే లోపే శివ‌రామ్ బ్లేడ్‌తో గొంతు, మ‌ణిక‌ట్టు కోసుకున్నాడు. తీవ్ర ర‌క్త‌స్రావంతో బాధ‌ప‌డుతున్న శివ‌రామ్‌ను ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో పోలీసులు చికిత్స నిమిత్తం బేతుల్ జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అయితే మ‌ద్యం మ‌త్తులో శివ‌రామే గొంతు కోసుకున్నాడా..? లేక ఎవ‌రైనా దాడి చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. శివరామ్ రాథోడ్ భార్య ప్రకారం, వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు, అయితే, ఈ జంట తరచుగా ఇతర విషయాలపై గొడవలు పడేవారని స్థానికులు తెలిపారు.