Weather Forecast: సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు వర్ష సూచన, ఈ జిల్లాలకు అలర్ట్
దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
Hyd, Oct 30: నిన్న దక్షిణ ఒడిస్సా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ చత్తీస్ ఘడ్, ఒడిస్సా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ, ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ దిశగా వంగి ఉంటుంది. దీని ప్రభావంతో ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఒడిశాలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురంలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం పడినట్లు అధికారులు వివరించారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అంచనా వేసింది.ఏపీలో నేడు పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అల్లూరి సీతారామరాజు,చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు.
తెలంగాణలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది.
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అలాగే, శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుపడే అవకాశాలున్నాయని వివరించింది.