LPG: వినియోగదారులు ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాలి, కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్నట్లుగా వార్తలు
పలు మీడియా నివేదికల ప్రకారం.. గ్యాస్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మోదీ సర్కార్ కొత్త రూల్స్‌ను (New rule for LPG) ప్రవేశపెట్టనుంది.
గ్యాస్ సిలిండర్లపై కొత్త నిబంధనలను తీసుకొచ్చి కేంద్రం షాక్ ఇవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి. పలు మీడియా నివేదికల ప్రకారం.. గ్యాస్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మోదీ సర్కార్ కొత్త రూల్స్‌ను (New rule for LPG) ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం... వినియోగదారులు ఇకపై ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు (15 LPG cylinders per year) చేయాల్సి ఉంటుంది.అలాగే నెలకు కేవలం 2 గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసేలా మార్పులు చేసింది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ప్రచారం మాత్రం కొనసాగుతోంది.
కాగా దేశంలో నాన్-సబ్సిడీ కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని నివేదికలు బయటపడ్డాయి. దీంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం అదనంగా సిలిండర్ల అవసరమైతే వినియోగదారులు సిలిండర్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలపడంతో పాటు నిర్ధేశించిన డ్యాకుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.