Nivar Cyclone Effect: భారీ వర్షాలతో వణికిపోతున్న ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు, తీవ్ర తుఫానుగా మారిన నివర్, తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు, రాత్రికి తీరం దాటే అవకాశం
నివర్ తుఫాన్ తమిళనాడు, ఏపీని (Nivar Cyclone Effect) కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతుండగా తుఫాను ప్రభావంతో (Nivar Cyclone) ఏపీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
Amaravati, Nov 25: నివర్ తుఫాన్ తమిళనాడు, ఏపీని (Nivar Cyclone Effect) కుదిపేస్తోంది. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తమిళనాడు తీర ప్రాంతం అతలాకుతలం అవుతుండగా తుఫాను ప్రభావంతో (Nivar Cyclone) ఏపీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అతి తీవ్ర తుఫాన్‌గా మారిన నివర్ ఈరాత్రికి కరైకల్-మామల్లాపురం దగ్గర తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. అయితే, తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రలో (Heavy Rains in AP and Tamil Nadu) ఇప్పటికే కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి.
తీవ్ర తుపానుగా కొనసాగుతున్న నివర్ మరికొన్ని గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం కనిపిస్తోంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తుపాను కరైకల్- మహాబలిపురం మధ్య ఈ అర్థరాత్రి లేదా రేపు ఉదయం తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ఈ అర్ధ రాత్రి లేదా రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉంది.
ఇప్పటికే తమిళనాడులో పలుచోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కడలూరు, మహాబలిపురం, పెరలూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, తీర ప్రాంతంలో గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ఈదురు గాలులు వీస్తుండటంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఏపీ, కర్నాటక, పుదుచ్చేరిలోనూ అక్కడక్కడా వర్షాలు దంచికొడుతున్నాయి.
Here's Nivar Effect in Tamil Nadu
ప్రస్తుతం కడలూరుకు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న నివర్ తుఫాన్ తమిళనాడు తీరం వైపు దూసుకొస్తోంది. తుఫాన్ హెచ్చరికలతో ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా 34 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ మరో 13 రైళ్లను దారి మళ్లించింది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరు కు 290 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొద్ది గంటల్లో పెనుతుపానుగా బలపడనుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
public holiday to continue till Nov 26 in 13 districts In TN
నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను, ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుపాను కారణంగా నెల్లూరు జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కోట, వాకాడు, చిట్టుమూడు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో రహదారులపై చెట్లు విరిగిపడటంతో పలుచోట్ల విద్యుత్ సరాఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో చెరువులన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
తీరప్రాంత గ్రామల్లోనూ, నదులు పొంగే ప్రాంతాల్లోను ఎన్డీఆర్ఎఫ్,ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మోహరించారు. జిల్లాలో 100 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతల్లో ప్రజలను సురక్షిత కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లుతో సహా జిల్లాలో 5000 మంది సిబ్బంది తుఫాన్ రెస్క్యూ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇవాళ రేపు జిల్లాలో భారీ వర్షాలు కురిస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హెచ్చరించారు.
మహాబలిపురం మధ్య తీరం దాటే సమయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదే తీవ్రతతో తుఫాను చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. తుఫాన్ సహాయక చర్యలపై ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ హరినాథ్ రావు మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరులలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము.
నాయుడుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు డివిజన్‌లలో ఎక్కువ తుఫాన్ ప్రభావం ఉంటుంది. ఒక్కో డివిజన్‌కు సూపరింటెండ్ ఇంజనీరు స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా నియమించాము. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి 20 ప్రత్యేక టీములను రప్పించాము. ఒక్కో టీమ్‌లో 10 మంది ఉంటారు. నిర్ణయించిన నాలుగు డివిజన్స్‌కు ముందస్తుగా విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, కండక్టర్ పంపాము. ఎక్కడైనా విద్యుత్‌కు అంతరాయం కలిగితే 1912 టోల్ ఫ్రీకి ఫోన్ చేయాలి అని తెలిపారు.
నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేశాం. సాధ్యమైనంత వరకు, అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దు. జిల్లాలో చెరువులు అన్ని నిండి ఉన్నాయి. సోమశిల జలాశయంలో 75 టీఎంసీలు, కండలేరులో 60 టీఎంసీ నీరు, సోమశిల నుండి 8,500 క్యూసెక్కులు, కండలేరు నుండి 6,500 కూసెక్కులు నీరు సముద్రంలోకి విడుదల చేశాము. ఆపదలో ఉన్న వారు 1077 కి కాల్ చేసి సాయం పొందవచ్చు అని కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు.
నివర్ తుపాను వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కడప ఎస్పీ కార్యాలయ ఆవరణంలో ట్రయిల్ రన్ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ఆదేశాల మేరకు 'నివర్' తుపానును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సంసిద్ధంగా మూడు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ సబ్ డివిజన్‌లో ఒక రెస్క్యూ బృందం ఏర్పాటు చేసినట్లు, బృందాలకు అవసరమైన అత్యవసర లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, తాళ్లను ఏఆర్ పోలీసు అధికారులు అందజేశారు
నివర్ తుపాను ప్రభావం జిల్లాపై కూడా ఉండటంతో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురు గాలులతోపాటు బారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. దాదాపు 68 చెరువుల వద్ద అధికారులను అలెర్ట్ చేశామన్నారు. 16 సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించినట్లు, నిరాశ్రయులకు పాఠశాల భవనాలలో అసరా కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అధిక వర్షపాతమున్న ప్రాంతాలలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.
నివర్ తుపాను ప్రభావం తిరుమలపై పడింది. ఈ తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడుతుండగా, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలయంలోనూ తడుస్తూనే స్వామి దర్శనానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే తరహా వాతావరణం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆలయంలోకి ప్రవేశిస్తున్న నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసేందుకు ప్రత్యేక మోటార్లను వినియోగిస్తున్నారు. ఇక చలి గాలుల తీవ్రత కూడా తిరుమలలో అధికంగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో నడక దారిలో వస్తున్న భక్తులతో పాటు, ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగి పడవచ్చన్న అంచనాతో, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఉదయం భక్తుల సంఖ్య కూడా తిరుమల కొండపై పలుచగానే ఉంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)