Cyclone Nivar: ముంచుకొస్తున్న మరో ముప్పు, తీవ్రరూపం దాల్చిన నివార్ తుఫాన్, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో ఏడు జిల్లాల్లో హై అలర్ట్‌
Cyclone Nivar (photo-Twitter)

Chennai, Nov 25: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం నివార్ తుపానుగా (Cyclone Nivar) మారింది. చెన్నైకి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 300 కిలోమీటర్ల సమీపంలో కేంద్రీకృతమైన ‘నివర్‌’ తుపాన్‌ తీరం వైపు వడివడిగా పయనిస్తోంది. రాబోయే 12 గంటల్లో పెను తుపానుగా మారి బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి చెన్నై సమీపంలోని మహాబలిపురం–కారైక్కాల్‌ (Mamallapuram) మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో చెన్నై (Chennai) సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో, ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తమిళనాడులో తుపాన్‌ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హై అలెర్ట్‌ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెంబరబాక్కంతోపాటు చెన్నై దాహార్తిని తీర్చే జలశయాలన్నీ ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. గత అనుభవాల దృష్ట్యా చెంబరబాక్కంలోని ఉబరి నీటిని విడుదల చేస్తామని, భయం వద్దని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి (Chief Minister Edapadi Palaniswamy) పేర్కొన్నారు.

తుపాన్‌ దృష్ట్యా బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించామని, పరిస్థితిని బట్టి సెలవు పొడిగిస్తామని చెప్పారు. తుపాన్‌ సహాయ చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) మంగళవారం సీఎం ఎడపాడితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

తుఫాన్ సముద్రంలో కదులుతున్న వీడియో చూశారా, నవంబర్ 25న తీరం దాటే అవకాశం, తమిళనాడు, ఏపీని వణికించనున్న అతి భారీ వర్షాలు

తుపాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 120–145 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 27వ తేదీ నాటికి తమిళనాడులో నివర్‌ తుపాన్‌ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ (AP and TS) వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నారు. నివర్‌ ( Nivar) ప్రభావం ఎక్కువగా తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమపై ఉంటుందని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అటు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు దగ్గర అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

అలాగే చిత్తూరు జిల్లాకు భారీ వర్ష సూచన ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ (91008 04313)ను ఏర్పాటు చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నంబర్ 1077 ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. తీర ప్రాంత ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేశారు.

ఈ నెల 25న తీరాన్ని దాటనున్న నివార్, ఏపీకి పెను ముప్పు, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలు అలర్ట్

ప్రస్తుతం తీవ్ర తుపానుగా మారిన ‘నివార్’..రానున్న 12 గంటల్లో అతి తీవ్ర తుపానుగా‌ మారనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. నివర్ తుఫాను రాత్రికి తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య , పుదుచ్చేరి ( Tamil Nadu Puducherry) దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

నివర్‌’ తుపాను నేపథ్యంలో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan) ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.

నివర్ ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు (Minister Kanna Babu) తెలిపారు. నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రైతాంగం వ్యవసాయ పనులయందు అప్రమత్తంగా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు.

ఇదిలా ఉంటే ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్‌ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది.