Amaravati,Nov 24: ఏపీ రాష్ట్రానికి ‘నివార్’ రూపంలో (Cyclone Nivar) మరో తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన ‘నివార్’ సైక్లోన్ మరో 24 గంటల్లో వాయుగుండం తుఫాన్‌గా బలపడనున్న నేపథ్యంలో మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే ఈ నెల 25, 26వ తేదీలలో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచనుండటంతో... మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 11 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కి.మీ., చెన్నయ్‌కి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం మరింత బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ఏర్పడితే ప్రపంచ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. ఇరాన్ సూచించిన ‘నివార్’ అనే పేరు పెడతామని ఐఎండీ (Indian Meteorological Department (IMD) అధికారులు తెలిపారు.
ఇది వాయువ్య దిశగా ప్రయాణించి పాండిచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మళ్లాపురం ప్రాంతం వద్ద ఈ నెల 25న (బుధవారం) తుపానుగా మారుతుందని.. ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి అదే ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ.. 25, 26 తేదీల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు.. గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు.
Here's IMD Tweet
D over SW and adjoining SE BOB moved NWwards,lay centred near Lat 9.5°N and Long 84.2°E,
at 0830 IST of today.Very likely to intensify into a CS during next 24 hrs and cross TamilNadu and Puducherry coasts between Karaikal and Mamallapuram around 25th Nov 2020 afternoon as SCS. pic.twitter.com/VI0z09k0HM
— India Meteorological Department (@Indiametdept) November 23, 2020
వాయుగుండం తుపానుగా మారనుందన్న సమాచారంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్.. గంగవరం, కాకినాడ పోర్టుల్లో నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం ఓడరేవుకు అప్రమత్తత సమాచారం అందించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇప్పటికే తుపాన్ ప్రభావిత ప్రాంతాల అధికారులను విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. వ్యవసాయ, వైద్య, రెవెన్యూ శాఖలను అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. తుపాన్ ముప్పుతో కోతకు సిద్ధంగా వరి, మినుము, పత్తి, పొద్దుతిరుగుడుకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా పంట కోతలు చేపట్టాలని రైతులకు అధికార యంత్రాంగం సూచనలు చేసింది.
దీని ప్రభావంతో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని, సరిపడా ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని సూచించారు.
తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌గాబా (Rajivgaba) సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్‌సీఎంసీ) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, ఎన్డీఆర్‌ఎఫ్ ఇతరత్రా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆయనకు వివరించారు. ఈ నెల 24–26 తేదీల మధ్య ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలను తుపాను ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ వివరించారు.