Kamma Rajyam Lo Kadapa Reddlu: 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాపై హైకోర్టులో పిటిషన్, మనోభావాలు దెబ్బతీసేలా చిత్రం ఉంది, సినిమాను అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించిన పిటిషనర్
అయితే తాము నిజజీవిత వ్యక్తులను ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు....
Hyderabad, November 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల (AP Politics) నేపథ్యంలో రాంగోపాల్ వర్మ రూపొందించిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' (Kamma Rajyam Lo Kadapa Reddlu) చిత్రం విడుదలను నిలిపివేయాలని ఎం. ఇంద్రసేన చౌదరి (M Indrasena Chowdary) అనే వ్యాపారవేత్త తెలంగాణ హైకోర్టు (High Court of Telangana) ను ఆశ్రయించారు.
ఆయన దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా టైటిల్ కమ్మ మరియు రెడ్డి కులాలకు చెందిన వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ కోర్టుకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సినిమా, నేరుగా నిజజీవిత వ్యక్తులైన ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వారి కుమారుడు లోకేశ్, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను లక్ష్యంగా చేసుకొని కేవలం దురుద్దేశపూర్వకంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు.
వారిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్లు, పాటల వీడియోలను ధర్మాసనం ముందుంచారు. అంతేకాకుండా ఈ సినిమాను అడ్డుపెట్టుకొని సోషల్ మీడియాలో కూడా విపరీతంగా విధ్వేషపూరితమైన ప్రచారం చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు.
Watch Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer:
ఈ సినిమా విడుదలైతే గొడవలు జరిగే ప్రమాదం ఉందని అంతకుముందు కేఏ పాల్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై హైకోర్ట్ ఈరోజు విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినిమా యూనిట్ సభ్యులు ఈ చిత్రం ఇంకా సెన్సార్ దశలోనే ఉంది, రివ్యూ జరుగుతుందని కోర్టుకు తెలియజేశారు. తాము నిజజీవిత వ్యక్తులను ఎవరినీ టార్గెట్ చేయలేదని చెప్పారు.
అయితే దీనిపై విచారణ హైకోర్ట్ వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, ఈ శుక్రవారం సినిమా రిలీజ్ చేయాలని ముందుగా సినిమా యూనిట్ ప్లాన్ చేసుకుంది. కేసు హైకోర్టులో ఉండటంతో విడుదల వాయిదా పడేవకాశం ఉంది.
ఓ మీడియా సమావేశంలో రాంగోపాల్ వర్మ (RGV) స్పందిస్తూ నిజజీవితంలో ఉండే వ్యక్తులపై ఈ చిత్రంలో ఎలాంటి పాత్రలు లేవని చెప్పారు. ఈ సినిమాలో ఉండే నటులు, నిజజీవితంలో ఉన్నవారిని పోలి ఉండటం యాదృచ్చికంగా పేర్కొన్నారు. ఈ సినిమా తెలుగు దేశం పార్టీ వారికి విపరీతంగా నచ్చుతుందని తెలిపారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర కూడ లేదని, మనసేన అనే పేరుతో ఓ వ్యక్తి కనిపిస్తాడు. అయితే ఇదొక రాజకీయ సినిమా కాదని, కామెడీ చిత్రమని వర్మ చెప్పారు. జబర్ధస్త్ చూడటం మానేయండి ఈ సినిమా అంతకంటే కామెడీగా ఉంటుందని చెప్పారు.