FICCI Convention 2020: రైతుల ఆదాయం రెట్టింపు కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు, ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశంలో వర్చువల్ ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ (PM Narendra Modi) తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశంలో (FICCI Convention 2020) ప్రధాని వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రసంగించారు.
New Delhi, December 12: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు (Farm Reform Laws) వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మధ్య ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడతాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకే కొత్త వ్యవసాయ సంస్కరణలను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ (PM Narendra Modi) తెలిపారు. ఎఫ్ఐసీసీఐ 93వ వార్షిక సమావేశంలో (FICCI Convention 2020) ప్రధాని వర్చువల్ కార్యక్రమం ద్వారా ప్రసంగించారు.
కొత్త చట్టాల ద్వారా రైతులకు నూతన వ్యవసాయ మార్కెట్ల సృష్టి జరిగి, సాంకేతికంగా రైతులు పురోగతి సాధించే వీలుందన్నారు. ‘‘వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన వ్యవసాయ మౌలిక సదుపాయాలు, ఆహార శుద్ధి, నిల్వలు, శీతల గిడ్డంగులు తదితర రంగాల మధ్య కొన్ని గోడలున్నాయి. నూతన చట్టాలతో ఈ గోడలన్నీ బద్దలైపోతున్నాయి. దీని ద్వారా రైతులకు కొత్త కొత్త మార్కెట్లు ఉద్భవిస్తాయి. సాంకేతిక ప్రయోజనాలు ఒనగూరుతాయి. సాంకేతిక ప్రయోజనాలు నెరవేరుతాయి. వీటి ద్వారా కొత్త పెట్టుబడులకు మార్గాలు తెరుచుకుంటాయి. వీటి ద్వారా రైతులు ప్రయోజనం పొందుతారని మోదీ వివరించారు.
రైతులు తమ పంటలను మండీలతో పాటు ఇతర ప్రదేశాల్లోనూ అమ్ముకోవచ్చని, రైతులు తమ ఉత్పత్తుల్ని డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ల్లోనూ అమ్ముకునే సౌకర్యం ఉందని ప్రధాని తెలిపారు. రైతులకు కొత్త మార్కెట్లకు కల్పిస్తున్నామని, టెక్నాలజీ ద్వారా వారు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. నూతన సంస్కరణలతో రైతులకు కొత్త మార్కెట్లు లభిస్తాయని, వారికి ఆప్షన్లు కూడా పెరుగుతాయని తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ మౌళిక సదుపాయాలను ఆధునీకరించనున్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని వల్ల వ్యవసాయ రంగంలో అధిక పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు.
దీంతో పాటుగా కోవిడ్19 నుంచి భారత్ శరవేగంగా కోలుకుంటోందని ఆయన అన్నారు. ఫిబ్రవరి-మార్చిలో కోవిడ్19 మహమ్మారి మొదలైనప్పుడు, ఓ తెలియని శత్రువుతో మనం పోరాడామని, అన్ని రంగాల్లో అనిశ్చితి నెలకొని ఉన్నదన్నారు. ప్రొడక్షన్, లాజిస్టిక్స్, ఆర్థిక వ్యవస్థతో పాటు అనేక అంశాల్లో సమస్యలు ఉండేవని, ఎన్నాళ్లు ఈ సమస్యలు ఉంటాయని, పరిస్థితులు ఎలా మారుతాయన్న ఆలోచనలు ఉండేవన్నారు.
20-20 క్రికెట్ మ్యాచ్‌లో క్షణం క్షణం పరిస్థితులు మారుతుంటాయని, 2020 ఏడాది కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నదని, మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎన్నో వడిదిడుకులను ఎదుర్కొన్నాయన్నారు. కొన్నేళ్ల తర్వాత కరోనా కాలం గురించి ఆలోచిస్తే, అప్పుడు ఆ విషయాలను నమ్మలేమని, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్19 నుంచి దేశం త్వరితగతిన కోలుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు.