BJP flags (Photo Credits: IANS)

New Delhi, December 11:  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. అటు కేంద్రం, ఇటు రైతులు తమ పట్టువిడువక పోవడంతో ప్రతిష్ఠంభన నెలకొంది. దీంతో రైతులు తమ పోరును మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు, ఇప్పటికే ఈ చట్టాలను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే, ఇటు కేంద్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇందుకోసం భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా భారీ ప్రచారం నిర్వహించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో రైతులతో 700 సమావేశాలు మరియు 100 ప్రెస్ మీట్‌లు పెట్టి కేంద్రం ప్రవేశపెట్టి వ్యవసాయ చట్టాలపై రైతులకు కలిగే ప్రయోజనాలు వివరించి చెప్పటంతో పాటు, వారి సందేహాలు నివృత్తి చేసి రైతులకు, ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించే లక్ష్యంతో బీజేపీ ఈ భారీ క్యాంపైన్ కు ప్రణాళికలు రచిస్తోంది. ఈ ప్రచారంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం  రైతు ఉత్పాదక ట్రేడ్ మరియు వాణిజ్య చట్టం, 2020,   (సాధికారత మరియు రక్షణ) ధరల భరోసా మరియు వ్యవసాయ సేవల చట్టం, 2020;  ఎసెన్షియల్ కమోడిటీస్ (సవరణ) చట్టం, 2020. అనే చట్టాలను ప్రవేశపెట్టింది. వీటిని ఉపసంహరించుకోవాలంటూ  రైతులు గత నెల నవంబర్ 26 నుంచి దిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు ఆందోళన చేపట్టారు. అయితే ఈ చట్టాలను సవరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

అయితే ఈ మూడు చట్టాలను కేంద్రం పూర్తిగా ఉపసంహరించుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అఖిల భారత కిసాన్ సభ పంజాబ్ ప్రధాన కార్యదర్శి మేజర్ సింగ్ పునావాల్ శుక్రవారం మీడియాతో పేర్కొన్నారు.   అంతేకాకుండా తమ తదుపరి ఆందోళన కార్యక్రమం డిసెంబర్ 12న  జైపూర్- దిల్లీ ఎక్స్‌ప్రెస్‌వేను అడ్డుకోవడం మరియు డిసి కార్యాలయాల వద్ద ధర్నాలు చేయడం, ఆ తర్వాత డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా అధికారులకు మెమోరాండంలను సమర్పించడం అని ఆయన వెల్లడించారు.