PM Modi At Tirumala: 140 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించిన ప్రధాని మోదీ, ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయంలోకి నరేంద్ర మోదీ

ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు.

PM Modi At Tirupati Temple

Tirumala, Nov 27: ప్రధాని నరేంద్ర మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ఆలయంలోకి వెళ్ళారు. మహాద్వారం వద్ద అర్చకులు ఇస్తికఫల్ స్వాగతం పలికారు.

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రధానికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి మొక్కుకుని స్వామివారి దర్శనానికి వెళ్లారు. మూలవిరాట్టు దర్శనం చేసుకున్నారు. అనంతరం హుండీ లో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని.. ఆలయంలో 50 నిమిషాలు గడిపిన మోదీ.. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. టీటీడీ డైరీ, క్యాలండర్‌లను ప్రధానికి అందించారు. ఆయన సుమారు 50 నిముషాల పాటు ఆలయంలో గడిపారు. అనంతరం రచన అతిథి గృహానికి చేరుకున్నారు. కాసేపు విశ్రాంతి అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధానికి పర్యటన సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గాలలో ఉన్న దుకాణాలు మూసివేశారు. వాహన రాకపోకలు నిషేధించారు. ప్రధాని పర్యటనకు మీడియాని కూడా అనుమతించలేదు.

Here's PM Tweet

ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం వైఎస్‌ జగన్‌ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు.

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో 140 కోట్ల మంది భారతీయులు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించాను' అని 'X' పోస్ట్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.