Tamil Nadu: వీడియో ఇదిగో, గవర్నర్ రాజ్‌భవన్‌లో ఉండగా పెట్రోల్ బాంబులతో దాడి, నిందితుడ్ని పట్టుకున్న తమిళనాడు పోలీసులు
రాజ్‌భవన్ వద్ద పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు.ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తమిళనాడు రాజ్‌భవన్ వెలుపల ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులతో దాడి చేయడం చైన్నైలో తీవ్ర కలకలం రేపింది. రాజ్‌భవన్ వద్ద పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు.ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
అయితే రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్ద బారికేడ్లు మాత్రం ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కారుకా వినోద్‌గా గుర్తించారు. ఘటన సమయంలో గవర్నర్ రాజ్‌భవన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
సైదాపేట కోర్టు బయట పార్క్ చేసిన ఉన్న బైకుల నుంచి పెట్రోల్ దొంగతనం చేసిన వినోద్.. రాజ్‌భవన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా ఆ రెండు బాటిళ్లకు నిప్పటించి మెయిన్ గేట్ వైపు విసిరాడు. నీట్ బిల్లు.. గవర్నర్ ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అయితే ఈలోపు అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది.. అతన్ని నిలువరించారు. అతని నుంచి మరో రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
Here's ANI Video
నీట్ బిల్లుకు గవర్నర్ ఆర్‌ఎన్ రవి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లే వినోద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. వినోద్ 2022లో చెన్నై బీజేపీ కార్యాలయంపైకి పెట్రోల్ బాంబులు విసిరిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు. దీనిపై ప్రతిపక్ష బీజేపీ అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది.