Delhi High Court (Photo Credits: IANS)

భార్య గ్రాడ్యుయేట్ అయినంత మాత్రానా ఆమెను ఉద్యోగం చేయమని బలవంతం చేయలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. విడిపోయి దూరంగా ఉంటున్న భర్త నుంచి భరణం పొందేందుకే ఉద్దేశపూర్వకంగా ఆమె జాబ్ చేయడం లేదని భావించలేమని కోర్టు పేర్కొంది. బీఎస్సీ డిగ్రీ కలిగిన భార్యకు చెల్లించే మధ్యంతర భరణాన్ని నెలకు రూ. 25,000 నుంచి రూ. 15,000కు తగ్గించాలని కోరుతూ ఓ భర్త ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. తన భార్య చదువుకుందని ఉద్యోగం చేసేలా ఆదేశాలు ఇస్తూ తను ఇచ్చే భరణాన్ని తగ్గించాలని కోర్టుకు విన్నవించాడు.

భర్త చెప్పిన చోటల్లా ఉండటానికి భార్య కూలీ కాదు, విడాకుల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం..భార్య గ్రాడ్యుయేట్‌ అయినంత మాత్రాన ఫ్యామిలీ కోర్టు ఆదేశించిన భరణంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అలాగే భర్త నుంచి భరణం పొందేందుకే ఉద్దేశపూర్వకంగా ఆమె పని చేయడం లేదని భావించలేమని పేర్కొంది. ఆమెకు, కుమారుడి ఖర్చుల కోసం ఫ్యామిలీ కోర్టు విధించిన భరణం సహేతుకంగానే ఉందని వెల్లడించింది.

ఇక మధ్యంతర భరణాన్ని భర్త ఆలస్యంగా చెల్లించడంపై రోజుకు రూ.1,000 చొప్పున జరిమానా చెల్లించాలన్న భార్య డిమాండ్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే మధ్యంతర భరణం ఆలస్యంపై భార్యకు 6 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. అలాగే వ్యాజ్యం ఖర్చుల చెల్లింపులో జాప్యంపై రోజుకు రూ. 550 చొప్పున జరిమానా చెల్లించాలన్న భార్య అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.