Tamil Nadu Rains: వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు..స్కూళ్లు మూసివేత, ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం (Chennai Rains) నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.
ఇటీవల మిగ్‌జాం తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు (Tamil Nadu Rains) కురిశాయి. దీంతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం (Chennai Rains) నీట మునిగింది. ఈ వానల నుంచి ఇప్పటికీ జనం కోలుకోక ముందే.. మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ తమిళనాడులో పలుచోట్ల ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. తిరునెల్వేలీ నగరం, రూరల్ తిరునల్వేలి ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇదిలా ఉండగా.. రాబోయే వారం రోజుల పాటు తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం అవుతున్నది. మిగ్‌జాం తుఫాను తమిళనాడు ఉక్కిరిబిక్కిరి చేసింది. తాగునీటికి సైతం జనం ఇబ్బందులుపడుతున్నారు. మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
తిరునెల్వేలి జిల్లాలోని పాపనాశం, మణిముత్తర్ డ్యామ్‌లలో నీటిమట్టం పెరిగింది. తామిరబరణి నది పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షం కురిసిన కారణంగా ఆకస్మిక వరద రావడంతో నీటిమట్టం వేగంగా పెరిగింది. దీంతో నీటిని దిగువకు విడుదల చేయాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఆదివారం పశ్చిమ కనుమల్లోని మంజోలై కొండల్లోని ఊతులో 16.9 సెంటీమీటర్లు, కక్కాచిలో 15, మంజోలైలో 13.5 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.
Here's Videos
తమిళనాడు వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీకి మరోసారి ఆరెంజ్ అలర్ట్ (Orange alert ) జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు (Rains) కురుస్తాయని తెలిపింది.
ఈ ప్రభావం దక్షిణ కోస్తా(South Coast), రాయలసీమ (Rayalaseema) ల్లో భారీ వర్షాలకు కారణమవుతుందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని, మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
రాష్ట్రంపైకి వీస్తున్న పొడిగాలులతో కోస్తా, రాయలసీమల్లోని ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తోందని వివరించారు. మిగ్‌జాం తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో చలి వాతావరణం పెరిగింది. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.