Telangana: దసరా తర్వాత ఉద్యోగుల రిటైర్మెంట్ వయోపరిమితి 60 లేదా 61 ఏళ్లకు పెంపు. పైరవీలు లేకుండానే ఉద్యోగులకు ప్రమోషన్లు, పంచాయతీ రాజ్ శాఖలో ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేస్తామని టీఎస్ సీఎం కేసీఆర్ ప్రకటన.
తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని, వారి వేతనాలను నెలకు రూ.8,500కు పెంచినట్లు సీఎం తెలిపారు...
Hyderabad, September 04: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని అధికారులకు సూచించారు. ప్రమోషన్ల కోసం ఉద్యోగులు ప్రజాప్రతినిధుల వద్ద, తమ ఉన్నత అధికారుల వద్ద పైరవీలు చేసే దుస్థితి పోవాలని సీఎం అన్నారు. ఉద్యోగులు కూడా పదోన్నతుల విషయంలో వేసుకున్న కేసులను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. అందరికీ పదోన్నతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను కూడా సృష్టిస్తామని సీఎం వెల్లడించారు.
మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో దూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అలాగే, వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.
పంచాయతీ రాజ్ శాఖలో అన్ని ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు సీఎం చెప్పుకొచ్చారు. తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36 వేల మంది సఫాయి కర్మచారుల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకుని, వారి వేతనాలను నెలకు రూ.8,500కు పెంచినట్లు సీఎం తెలిపారు.
గ్రామ పంచాయతీల కోసం ప్రభుత్వం నెలకు 339 కోట్ల చొప్పున నిధులను విడుదల చేస్తున్నదని సీఎం చెప్పారు. ఒక ఏడాది ఖర్చు చేయగా మిగిలిన నిధులను, వచ్చే ఏడాదికి బదిలీ చేసేలా చట్టంలో నిబంధన చేర్చినట్లు పేర్కొన్నారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ఇప్పటికే అమలులోకి వచ్చింది. అందులో సర్పంచులు మరియు అధికారుల బాధ్యతలను, నిర్వర్తించాల్సిన విధులను స్పష్టంగా పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచులపై కలెక్టర్లు చర్య తీసుకుంటే, స్టే ఇచ్చే అధికారం మంత్రులకు కూడా లేకుండా చట్టంలోనే నిబంధనలున్నాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.