Hyderabad Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం, చెరువును తలపిస్తున్న పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిక

రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది.

Hyderabad Rains (phot0-Video Grab)

Hyd, Oct 1: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి, మూసాపేట్, నిజాంపేట్ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. టోలిచౌకి, మెహదీపట్నం, షేక్ పేట్, అత్తాపూర్, లంగర్ హౌస్, మణికొండ, మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, బంజారాహిల్స్లో వర్షం దంచి కొడుతోంది.

హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం, కీలక ఉత్తర్వులు జారీ చేసిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట-అమీర్‌పేట రహదారి చెరువును తలపించేలా వరద నీటితో నిండిపోయింది.ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఆ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వర్షపు నీటికి రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాన్ స్టాప్‌గా వరుణుడు విజృంభిస్తుండడంతో వాహనదారులు మెట్లోస్టేషన్ల కింద తలదాచుకున్నారు.

మరికొంతమంది తమ వాహనాలను వదిలేసి షాపింగ్ మాల్స్‌లోకి దూరారు. మరో గంటపాటు భారీ వర్షం కురవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.