Telugu States Floods: వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని మోదీ హామీ, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని వెల్లడి

వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది.

PM Modi Apologises for Sindhudurg Statue Collapse (photo-ANI)

Vjy, Sep 2: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వాగులు, వంకలు, నదులు అన్నీ ఏకమయ్యాయి. చాలా ప్రాంతాలలో చెరువులు, జనావాస ప్రాంతాలు అనే తేడా లేకుండా మొత్తం జలమయంగా మారింది. వరద విలయానికి ప్రజాజీవనం స్తంభించింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో గత మూడున్నర దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా బీభత్సమైన వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఏపీ, తెలంగాణలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని చెప్పారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని విజయవాడలోనే మకాం వేశారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చూస్తున్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.  తెలంగాణ వరదలు, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన ప్రభుత్వం, వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం ఆదేశాలు

ఏపీలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న వరద సహాయ చర్యలను సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. అందుకు మోదీ స్పందిస్తూ... ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలను ఆదేశించామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని స్పష్టం చేశామని వెల్లడించారు. తక్షణమే ఆయా శాఖల నుంచి ఏపీకి అవసరమైన సామగ్రి పంపాలని ఆదేశించామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.