Hyd, Sep 2: కనివినీ ఎరుగని రీతిలో గత రెండు రోజులుగా వర్షాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవవుతున్నాయి. జనజీవనం స్తంభించింది. కాలనీలకు కాలనీలే వరద నీటిలో చిక్కుకుపోతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా, నిజామాబాద్ తదితర జిల్లాల్లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. నదులు, ఏరులు, వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి.
వరదలు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్షాలు, వరద సాయంపై నిర్వహించిన సమీక్ష (CM Revanth Reddy holds emergency review) నిర్వహించారు. వరదల వల్ల చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం రూ.5 లక్షలకు పెంచి ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘‘భారీ వర్షాలు ఉన్నచోట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలోని కలెక్టరేట్‌లలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో 8 పోలీసు బెటాలియన్లకు ఎన్డీఆర్‌ఎఫ్ తరహా శిక్షణ ఇవ్వాలి. ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలి. చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలి. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక అందించాలి’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో నేడు కూడా భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అతి తీవ్ర వర్ష సూచన.. హైదరాబాద్ లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక
వరద ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ‘అధికారులు సెలవులు పెట్టొద్దు. సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకొని, పనుల్లో నిమగ్నం కావాలి. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ.. సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎంవోకు పంపాలి’ అని స్పష్టం చేశారు. వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, దామోదర్ రాజనర్సింహ, జూపల్లి తదితరులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఎత్తిపోతల ద్వారా ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేసే అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మరో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్తు, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ ఏర్పాట్లు చేపట్టాలి. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావొద్దు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అవసరం ఉన్నా.. అధికారులకు ఫోన్‌లో సమాచారం ఇవ్వండి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా.. భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.