Tomato Prices Soar: డబుల్ సెంచరీకి దగ్గర పడుతున్న కిలో టమాటా ధరలు, ఆకాశాన్ని తాకుతున్న కూరగాయల ధరలు, ఎలా బతకాలంటూ సామాన్యుడు ఆందోళన
టమాటా పండించే ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షం కారణంగా సరఫరా తగ్గిపోవడమే దీనికి కారణం.
Tomato prices soar across country: దేశవ్యాప్తంగా మార్కెట్‌లో టమాటా ధరలు ఇటీవల కిలో రూ.10-20 నుంచి ఒక్కసారిగా రూ.100-150 వరకు పెరిగాయి. టమాటా పండించే ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షం కారణంగా సరఫరా తగ్గిపోవడమే దీనికి కారణం.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతినడంతో పాటు రవాణా కష్టతరంగా మారడంతో దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక, దాని రాజధాని నగరం బెంగళూరులో టమోటా ధరలు కూడా ఆకాశాన్నంటాయి.బెంగళూరు మార్కెట్‌లో టమాట ధర కిలో రూ.100 పలికిందని, భారీ వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్నాయని వ్యాపారులు తెలిపారు. ముందు ముందు టమాటా ధరలు రూ.200 వరకు వెళ్లే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
యూపీలోని కాన్పూర్ మార్కెట్‌లో వారం రోజుల క్రితం కిలో రూ.40 నుంచి 50కి విక్రయించిన టమాటా ఇప్పుడు కిలో రూ.100కి విక్రయిస్తుండగా, ఢిల్లీలో కిలో రూ.80కి విక్రయిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిత్యావసర కూరగాయల కొరత సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతోంది. హోల్‌సేల్‌లో కిలో రూ.80-90 పలుకగా, రిటైల్ షాపుల్లో కిలో రూ.100కి టమాట విక్రయిస్తున్నారు.
'వర్షం కారణంగానే ధర పెరిగింది. బెంగళూరు నుంచి టమోటాలు వస్తున్నాయి. 10 రోజుల్లో ఇది మరింత పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ నెలలో టమోటా ధరలు సాధారణంగా పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. వర్షం కారణంగా, కర్ణాటకలోని టమోటాలు పండించే జిల్లాలైన కోలార్, చిక్కబల్లాపూర్, రామనగర, చిత్రదుర్గ, బెంగళూరు రూరల్‌లో టమోటాల సరఫరాలో గణనీయమైన అంతరాయం ఏర్పడింది.
దేశంలో టమాటా సాగు ఎక్కువగా ఉంటే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలు, వరదలతో పంటలకు నష్టం వాటిల్లింది. దీంతో సరాఫరా తగ్గిపోయింది. మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను నాశనం చేయడం కూడా కారణంగా మారింది.
అంతకుముందు వేసవిలో అధిక ఎండలతో ఉత్పత్తి తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదలకు ఓ కారణమని రైతులు పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు మొక్కలు నాటినట్లు రైతులు చెబుతున్నారు. గత నెలలో టమాట ధరలు పతనమవ్వడం, బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారినట్లు పేర్కొన్నారు.
టమాట కాకుండా ఇతర కూరగాయలైన బెండ, కాకర, దొండ, వంకాయ, దోస, బీర, ఆలుగడ్డ, మునగ, గోకరతో పాటుగా ఆకుకూరలు ధరలు కూడా భారీగా పెరిగాయి. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
15 రోజుల క్రితం పచ్చిమిర్చి ధర కిలో రూ.30 నుంచి రూ.40 వరకు, టమాట కిలో రూ.40 మాత్రమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే టమాట రెండు కిలోలు రూ.10 విక్రయించారు. మిగతా కూరగాయల ధరలు కూడా పదిరోజుల క్రితం కిలో రూ.30 నుంచి రూ.40 వరకు మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి ధరలు కూడా రెండింతలు కావడంతో సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఆకుకూరలు కూడా ఏ రకమైనా గతంలో రూ.10కి 4 కట్టలు వచ్చేవి.. ఇప్పుడు రూ.20 నుంచి రూ.30కి 4 కట్టలు ఇస్తున్నారు.