Bar Code On TTD Laddu: శ్రీవారి లడ్డులకు బార్ కోడ్, ఇకపై అక్రమాలకు అడ్డుకట్ట, రెండు చోట్ల స్కానింగ్ ప్రక్రియ, భక్తులందరికీ 160-180 గ్రాముల ఒక చిన్న లడ్డును ఉచితంగా అందించే ఆలోచనలో టీటీడీ
Tirupathi, November 13: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (Tirumala Tirupati Devasthanam) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ( Tirumala Sri Venkateswara temple)దర్శనానికి వెళ్లే భక్తులకు బార్ కోడ్ విధానం ద్వారా లడ్డూలు అందిస్తామని పాలక మండలి తెలిపింది. కేవలం దర్శనం చేసుకున్న వారికి మాత్రమే లడ్డూలు ఇస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. కాగా తిరుమలలో 15 రోజుల క్రితం 23 మంది లడ్డూ దళారులను భద్రతా సిబ్బంది గుర్తించారని అదనపు ఈవో తెలిపారు. ఈ క్రమంలో లడ్డూ టోకెన్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రెండంచెల స్కానింగ్ విధానాన్ని 30 రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
సర్వదర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్సుల్లో మొదట లడ్డూ టోకెన్లను స్కాన్ చేసి భక్తులకు అందిస్తారని, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని స్కానింగ్ పాయింట్ దగ్గర మరోసారి స్కాన్ చేసేలా నూతన విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. కాగా రెండోసారి స్కాన్ చేసిన సమాచారం మాత్రమే లడ్డూ కౌంటర్లకు చేరుతుందన్నారు. పీఏసీల్లో లాకర్లు కేటాయించే సమయంలో తాళం చెవిని భక్తులకు అందిస్తామని, ఖాళీ చేసేటపుడు భక్తులు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇకపై దర్శనం చేసుకున్న భక్తులందరికీ 160-180 గ్రాముల చిన్న లడ్డూ ఒకటి ఉచితంగా ఇవ్వాలని టీటీడీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా (Chittoor district) వాసులకు టీటీడీ (TTD) పాలక మండలి శుభవార్తను చెప్పింది. జూనియర్ అసిస్టెంట్( junior assistant) స్థాయి వరకు ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు(guarantees 75% of jobs to local youth) కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసిన టీటీడీ పాలకమండలి.. ప్రభుత్వ అనుమతి (Andhra Pradesh government) కోసం పంపింది. అలాగే కొండపై దశలవారీగా ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించింది. కలియుగ వైకుంఠం తిరుమలలో ప్లాస్టిక్ నిర్మూలన చర్యలు మరింత పటిష్టం చేశారు.
గత పాలకమండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు తిరుమలలో మూడు దశల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధిస్తామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో టీటీడీ కార్యాలయంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధం చేపడతామన్నారు. 15 రోజుల్లో అతిథి గృహాలు, హోటళ్లలో వాటర్ బాటిళ్ల వాడకం నిషేధిస్తామని, వీటికి ప్రత్యామ్నాయంగా వాటర్ ప్లాంటులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో పాటుగా జీఎంఆర్ సంస్థ ద్వారా తిరుమలలో ఉద్యానవనాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. త్వరలో తిరుమల రాయ మండపంలో తులాభారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.