Shanthanu Takur on Mamata Govt: ఐదు నెలల్లో మమతా గవర్నమెంట్ పడిపోతుంది, కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారంటూ జోస్యం
బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్, తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొంగావ్‌లో ఆదివారం జరిగిన పార్టీ మీటింగ్‌లో మాట్లాడారు. టీఎంసీ ప్రభుత్వం ఐదు నెలలకు మించి అధికారంలో ఉండదని అన్నారు.
Kolkata, July 16: పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం (Mamata Banerjee’s government Will Collapse) ఐదు నెలల్లో కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మళ్లీ ఊహాగానాలు చేస్తున్నారు. టీఎంసీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉందన్నారు. బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి శంతను ఠాకూర్, తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొంగావ్‌లో ఆదివారం జరిగిన పార్టీ మీటింగ్‌లో మాట్లాడారు. టీఎంసీ ప్రభుత్వం ఐదు నెలలకు మించి అధికారంలో ఉండదని అన్నారు. టీఎంసీ రిగ్గింగ్‌కు పాల్పడకపోతే పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలతో బీజేపీ గెలిచి ఉండేదని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పక్షపాతంగా వ్యవహరించినట్లు ఆయన ఆరోపించారు. అయితే టీఎంసీ ప్రభుత్వానికి ఇవే చివరి ఎన్నికలని అన్నారు.
కాగా, బీజేపీ బెంగాల్ చీఫ్ సుకాంత మజుందార్ కూడా శంతను ఠాకూర్ వ్యాఖ్యలను సమర్థించారు. ఏ సమయంలోనైనా ఏదైనా జరుగవచ్చని అన్నారు. టీఎంసీ ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి ఎదురు తిరుగవచ్చన్నది ఎవరికి తెలుసని అన్నారు. రాజకీయాల్లో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. అలాగే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చివేయలేనప్పటికీ, రాజ్యాంగం సూచించిన విధంగా విధిని నిర్వర్తించడంలో ప్రభుత్వం విఫలమైతే రక్షించడానికి కేంద్రం జోక్యం చేసుకుంటుందని బీజేపీ నేత, బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. రాష్ట్రంలో ఆర్టికల్ 355ను కేంద్రం అమలు చేయాలని ఇటీవల ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు బీజేపీ నేతల వ్యాఖ్యలను టీఎంసీ నేతలు తిప్పికొట్టారు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి శాంతను సేన్ దీని గురించి మాట్లాడారు. రెండేళ్ల కిందట భారీ ఆధిక్యంతో మూడోసారి అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ బెదిరించడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి వల్ల నిరాశతో ఉన్న బీజేపీ నేతలు ఢిల్లీలో తమ రేటింగ్‌ను పెంచుకునేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు.
టీఎంసీ ప్రభుత్వం పడిపోతుందంటూ గతంలో కూడా బీజేపీ నేతలు చాలా సార్లు అంచనాలు వేశారని, నిర్దిష్ట తేదీలు కూడా ప్రకటించినప్పటికీ ఏమీ జరుగలేదని శాంతను సేన్ అన్నారు. వరుస ఓటములతో తీవ్ర నిరాశతో ఉన్న బీజేపీ నేతలు ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు దానిని అడ్డుకుంటారని తెలిపారు. టీఎంసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత నిరుత్సాహానికి గురైన శ్రేణుల మనోధైర్యాన్ని పెంచడానికి బీజేపీ నేతలు ఇలాంటి పసలేని వాదనలు చేస్తున్నారని విమర్శించారు.