Nirmala Sitaraman Viral Video: రోడ్డు పక్కన కూరగాయలు కొన్న దేశ ఆర్ధిక మంత్రి, చెన్నై కూరగాయల మార్కెట్లో సడెన్‌గా ప్రత్యక్షమైన నిర్మలా సీతారామన్, కూరగాయల రేట్లు చూసి షాక్ అయ్యారా? అంటూ విపక్షాల కౌంటర్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ వినియోగించడంపై విమర్శలు
ధరల పెరుగుదల లేదని సంకేతాలు పంపేందుకు ఇలా సామాన్యుల్లో కలిసిపోయారని విశ్లేషకులు చెప్తున్నారు.
Chennai, OCT 09: దేశ ఆర్థిక మంత్రి హోదాలో నిత్యం బిజీగా ఉండే నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) కూరగాయల మార్కెట్‌లో ప్రత్యక్ష్యమయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం తమిళనాడు రాజధాని చెన్నైకు వచ్చారు. ఈ క్రమంలో రాత్రి సమయంలో చెన్నైలోని (Chennai) మైలాపూర్ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ కు వెళ్లారు. అక్కడ పలు రకాల కూరగాలను కొనుగోలు (Vegetable Shopping) చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను నిర్మలా సీతారామన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన ఆమె ఓ దుకాణం వద్దకు వెళ్లి వివిధ రకాల కూరగాయల ధరల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్వయంగా పలురకాల కూరగాయలను తనిఖీచేసుకొని కొనుగోలు చేశారు.
అనంతరం అక్కడే ఉన్న కూరగాయల వ్యాపారులతో, స్థానిక ప్రజలతో మాట్లాడారు. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి అంటూ ఆరా తీశారు. ఊహించని విధంగా కేంద్ర మంత్రి స్వయంగా కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్ రావడంతో స్థానికులు కేంద్ర మంత్రితో మాట్లాడేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ చేసిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ధరల పెరుగుదలపై విపక్షాలు ఆర్ధిక మంత్రిని నిలదీస్తున్న సమయంలో ఆమె సామాన్య మహిళగా మారి కూరగాయలు కొనుగోలు చేయడం సంచలనంగా మారింది. ధరల పెరుగుదల లేదని సంకేతాలు పంపేందుకు ఇలా సామాన్యుల్లో కలిసిపోయారని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ పోస్టులకు మిశ్రమ స్పందన వస్తోంది. పెరిగిన ధరలను తెలుసుకునేందుకు వెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ కొందరు రిప్లై ఇస్తుండగా, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించడాన్ని కొందరు ప్రశ్నిస్తున్నారు.