West Bengal: షాకింగ్ వీడియో, అమ్మవారి విగ్రహం నిమజ్జనం చేస్తుండగా మెరుపు వరదలు, ఒక్కసారిగా నీటిలో కొట్టుకుపోయిన వందలాది మంది భక్తులు, 8 మంది మృతి
ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
Kolkata, Oct 6: పశ్చిమ బెంగాల్‌లో విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు.
వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని జల్పైగురి జిల్లా కలెక్టర్ మౌమితా గోదర వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు
Here's Video
ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.