ITR: ఐటీఆర్ రీఫండ్ ఆలస్యమవుతుందా? ఈ కారణాల వల్లనే అయిండొచ్చు! ఒకసారి ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి
రూ.1000 ఫైన్ చెల్లించి డిసెంబర్ నెలాఖరు వరకూ ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాటికి 5.77 కోట్ల ఐటీఆర్‌ల ప్రాసెస్ పూర్తయింది.
New Delhi, SEP 01: గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ ఫైల్ (ITR) చేయడానికి జూలైతో గడువు ముగిసినా.. రూ.1000 ఫైన్ చెల్లించి డిసెంబర్ నెలాఖరు వరకూ ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాటికి 5.77 కోట్ల ఐటీఆర్‌ల ప్రాసెస్ పూర్తయింది. టాక్స్ పేయర్లు తాము క్లయిమ్ చేసిన మేరకు కొందరికీ రీఫండ్ (Refund) అయింది. మరికొందరి ఐటీఆర్‌ల ప్రాసెస్ పూర్తయినా రీఫండ్ కావడానికి జాప్యం జరుగుతున్నది. దీనికి కారణాలు తెలుసుకుందామా..
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు నమోదు చేస్తున్న సమాచారంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. కొందరు తమ బ్యాంక్ అకౌంట్ డిటైల్స్ పొరపాట్లు చేసినా రీఫండ్ ఆలస్యమవుతుంది. కనుక మీ ఐటీఆర్‌లో (ITR) బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా చెక్ చేసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కోసారి ఐటీఆర్ సరిగ్గా ఫైల్ చేసినా.. అదనపు వివరాలివ్వాలని ఐటీ విభాగం మీకు నోటీసు ఇవ్వవచ్చు. వెంటనే ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆ వివరాలు చెక్ చేసుకుని.. మీకు వచ్చిన నోటీసుపై సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసిన వారు తాము చెల్లించిన మొత్తం పన్నులో రీఫండ్ క్లయిమ్‌ల్లో ఒక్కోసారి ఎక్కువగా క్లయిమ్ చేసినట్లు ఉండొచ్చు. అటువంటప్పుడు మీరు ఇచ్చిన వివరాలు సరైనవేనా అంటూ మరోసారి ధ్రువీకరించాలని ఆదాయం పన్ను విభాగం నుంచి సమాచారం వస్తుంది. అన్నీ సరిగ్గానే ఉన్నాయని వివరించాలి.
ఐటీఆర్‌లో తప్పులు ఉన్నా.. అసంపూర్ణ సమాచారం ఇచ్చినా.. వాటి ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి తిరస్కరించవచ్చు. అటువంటి పరిస్థితిని నివారించడానికి ఐటీఆర్‌లో సమాచారం నమోదు సమయంలో తప్పుల్లేకుండా చూసుకోవాలని సూచిస్తుంది ఐటీ విభాగం. రిటర్న్స్‌లో క్లయిమ్‌లకు, 26ఎఎస్ ఫామ్‌లో వివరాలకు సరిపోలక పోతే ఐటీ విభాగం మీ రీఫండ్ క్లయిమ్ ప్రాసెస్ చేయకపోవచ్చు. టీడీఎస్ వసూలు చేసిన సంస్థ గానీ, ఆ సంస్థ ఖాతా గల బ్యాంకు గానీ ఆ మొత్తం ఆదాయం పన్ను విభాగం ఖాతాలో డిపాజిట్ చేయకున్నా రీఫండ్ ఆలస్యమవుతుంది. మరికొన్ని సందర్భాల్లో రిటర్న్స్ ప్రాసెసింగ్ ఆలస్యం వల్ల రీఫండ్‌పై ప్రభావం పడుతుంది.
ఐటీఆర్ రీఫండ్ పరిస్థితి తెలుసుకోవడానికి ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. మీరు మీ రిటర్న్స్ ఈ-వెరిఫై చేశారా.. లేదా? చెక్ చేసుకోవాలి. అలా చేయకపోతే ముందు ఆ పని పూర్తి చేయాలి. ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయని ఐటీఆర్‌లను ఆదాయం పన్ను విభాగం పరిశీలించదు. ఆదాయం పన్ను విభాగం నుంచి వచ్చే ఈ-మెయిల్స్, ఎస్ఎంఎస్‌లు చూసుకోవాలి. ఐటీ విభాగం ఈ-పోర్టల్‌లోనూ సమాచారం ఉంటుంది. ఐటీ విభాగం అడిగిన ప్రశ్నలకు సరిగ్గా జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీ ఈ-ఫైలింగ్ వెబ్ సైట్‌లో మీ సమస్య పరిష్కారానికి సేవా విభాగం సేవలు పొందొచ్చు.