Ajit Pawar on Rumors: బీజేపీలోకి వెళుతున్నారనే వార్తలను ఖండించిన అజిత్ పవార్, ఎన్సీపీతోనే నా ప్రయాణమని స్పష్టం, పుకార్లను నమ్మవద్దని కార్యకర్తలకు సూచన
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మద్దతుదారులతో సహా బీజేపీలోకి మారతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్లపై ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఎన్సీపీలో ఉన్నానని, ఎన్సీపీలోనే ఉంటానన్నారు.
Mumbai April 18: మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తన మద్దతుదారులతో సహా బీజేపీలోకి మారతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ రూమర్లపై ఎన్సీపీ నేత అజిత్ పవార్(Ajit Pawar) ఇవాళ క్లారిటీ ఇచ్చారు. ఎన్సీపీలో ఉన్నానని, ఎన్సీపీలోనే ఉంటానన్నారు.
ఎటువంటి కారణం లేకుండా మీడియా రూమర్లు వ్యాప్తి చేస్తోందని ఆయన ఆరోపించారు. 40 మంది ఎమ్మెల్యేల నుంచి తానేమీ సంతకాలు తీసుకోలేదని, వాళ్లు కేవలం తనను కలిసేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఇది రొటీన్ ప్రక్రియ అని, దీంట్లో మరో ఉద్దేశం లేదన్నారు. ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారని, అయితే వాళ్లేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శరద్ పవార్ నేతృత్వంలోనే ఎన్సీపీ ఏర్పడిందని అజిత్ పవార్ తెలిపారు.
ప్రచారాన్ని ఖండించిన ఆయన.. ఏ కారణం లేకుండా రూమర్లను ప్రచారం చేస్తున్న మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. పుకార్లలో ఏదీ నిజం కాదు. ఎన్సీపీలోనే ఉంటా. ఎన్సీపీతోనే నా ప్రయాణం కూడా అని పేర్కొన్నారు. ఎన్సీపీలో ముసలం, ప్రతిపక్షాల కూటమిలో చీలిక వచ్చిందన్న ప్రచారాల్ని ఆయన ఖండించారు. ఇలాంటి ప్రచారాల వల్ల ఎన్సీపీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే. ఎలాంటి ఆందోళన చెందకండి. ఎన్సీపీ అనేది శరద్ పవార్ నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మన ఉనికి మనదే అజిత్ పవార్ ప్రకటించారు.
పవార్ తర్వాత నెంబర్ టూగా ఎన్సీపీలో ఆయన అన్న కొడుకు అజిత్ పవార్ హవా నడుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు సైతం ఆయన వెంట ఉన్నారు. అయితే.. పవార్ కూతురు సుప్రియా సూలే ఈ ఉదయం చేసిన వ్యాఖ్యలు మహా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. వచ్చే పదిహేను రోజుల్లో రెండు పెద్ద రాజకీయ కుదుపులకు వేదిక కానుందని వ్యాఖ్యానించారు.
ఒకటి ఢిల్లీ స్థాయిలో, మరొకటి మహారాష్ట్రలో రాజకీయ కుదుపులు ఉండనున్నాయని ఆమె పేర్కొన్నారు. అయితే అవేంటని మీడియా ఆమెను ఆరా తీయగా.. దాటవేత సమాధానం ఇచ్చారు. అది అజిత్ పవార్ పార్టీ మారడం గురించేనా అని అడగ్గా.. ఆ విషయాన్ని అజిత్ దాదా(అజిత్ పవార్‌ను ఉద్దేశించి)నే అడగాలని రిపోర్టర్లకు సూచించారు. ప్రజాప్రతినిధిగా తనకు చాలా పని ఉందని, ఉత్తినే మాట్లాడేందుకు తనకు సమయం లేదన్నారు.
అంతకు ముందు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్.. ఎన్సీపీ ఎమ్మెల్యేల చీలిక, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ వచ్చిన కథనాలను ఖండించారు. ‘పవార్ ఎన్సీపీ ఎమ్మెల్యేలతో ఎలాంటి సమావేశానికి పిలుపు ఇవ్వలేదు. అతను ఎన్సీపీ కోసమే పని చేస్తున్నాడు. ఇంతా మీ బుర్రలోంచి పుట్టిందేమో అంటూ మీడియాకు చురకలు అంటించారు.
అంతకుముందు ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం ప్రకారం, అజిత్ పవార్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారు. బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వారసునిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఈ కథనం తెలిపింది. ఎన్‌సీపీ ఎమ్మెల్యేల మద్దతును ఆయన కూడగడుతున్నారని తెలిపింది.
ఎన్‌సీపీకి ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సుమారు 40 మంది అజిత్ పవార్ వైపు ఉన్నట్లు ఈ కథనం తెలిపింది. వీరందరూ సంతకాలు చేసిన మద్దతు లేఖను సమయం వచ్చినపుడు గవర్నర్‌కు సమర్పించాలని నిర్ణయించారని తెలిపింది. ఈ వివరాలను ఎన్‌సీపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వివరించింది.
2019లో అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు శరద్ పవార్ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి, పార్టీని ముక్కలు కాకుండా అడ్డుకోగలిగారు. శివసేన (ఉద్ధవ్ బాల్ థాకరే) వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, అజిత్ పవార్ తిరుగుబాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు నిరాధారమైనవని చెప్పారు. తాను మంగళవారం ఉదయం అజిత్ పవార్‌తోనూ, ఇతర ఎన్‌సీపీ నేతలతోనూ మాట్లాడానని తెలిపారు. మహావికాస్ అఘాడీ కూటమిని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే ఇటువంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారన్నారు. తమను బలహీనపరచగలమనుకోవడం పొరపాటు అని స్పష్టం చేశారు.