AP Capital-Political Row: దమ్ముంటే 21మందితో రాజీనామా చేసి రెఫరెండంకి రా, చంద్రబాబుకు సవాల్ విసిరిన కొడాలి నాని, బీసీజీ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టమన్న చంద్రబాబు, మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించిన జనసేన ఎమ్మెల్యే
ఏపీలో (AP Politics) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు (AP Capital Change) విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీజీ రిపోర్ట్ ఏపీ సీఎం జగన్ కి (AP CM YS Jagan) అందిన నేపథ్యంలో రాజధానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Amaravathi, January 04: ఏపీలో (AP Politics) రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా రాజధాని మార్పు (AP Capital Change) విషయంపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బీసీజీ రిపోర్ట్ ఏపీ సీఎం జగన్ కి (AP CM YS Jagan) అందిన నేపథ్యంలో రాజధానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నేతలు రాజధాని మార్పు మీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని విషయం మీద నేతల ప్రసంగాలను ఓ సారి పరిశీలిస్తే..
చంద్రబాబుకి సవాల్ విసిరిన కొడాలి నాని
దమ్ముంటే 21మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి రాజధానిపై రెఫరెండంకి రావాలని చంద్రబాబుకి(Chandrababu) వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని (YSRCP MLA Kodali Nani) సవాల్ విసిరారు. ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటే 21మంది గెలుస్తారని చెప్పారు. బోస్టన్ గ్రూప్, (BCG Report)జీఎన్ రావు నివేదికలను(GN Rao committee) భోగి మంటల్లో తగలబెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు.
జనవరి 9 నుంచి అమ్మఒడి, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.15 వేలు
రిపోర్టులను భోగి మంటల్లో వేయడం కాదు.. గత రోహిణి కార్తె మంటల్లో టీడీపీని ప్రజలు తగలబెట్టారని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు మాయమాటలతో రైతులను మభ్యపెట్టారని, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మండిపడ్డారు. రైతుల భూములు బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా కోరే హక్కు టీడీపీకి లేదని కొడాలి నాని అన్నారు.
బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం: చంద్రబాబు
ఏపీ ప్రభుత్వం, బీసీజీ కమిటీ రిపోర్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీజీ రిపోర్టు ఒక చెత్త కాగితం..ఈ రిపోర్టును భోగిమంటల్లో తగలబెట్టండని పిలుపు ఇచ్చారు. బీసీజీ ఎప్పుడు వేశారు? దానికి తలా, తోక ఉందా అని మండిపడ్డారు. తప్పుడు కమిటీలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఎవరిని మోసం చేయడానికి హై పవర్ కమిటీ వేశారని ప్రశ్నించారు. బీసీజీ నివేదికతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, క్లయింట్ కు ఏది కావాలో బీసీజీ అదే రాసిందన్నారు. బీసీజీ రిపోర్టును కేబినెట్ అధ్యయనం చేస్తుందా అని ప్రశ్నించారు. అజయ్ కల్లాం చెప్పినట్లు జీఎన్ రావు కమిటి రిపోర్టు ఇచ్చిందని ఆరోపించారు. మూడు రాజధానులు చేయడానికి మీకు అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా? అని మండిపడ్డారు. అమారావతిని చంపేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు వైఎస్సార్..నేడు వైఎస్ జగన్, ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి
మూడు రాజధానుల ప్రకటనను స్వాగతిస్తున్నా: జనసేన ఎమ్మెల్యే
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని అన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక ఏం చెబుతోంది
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. బోస్టన్ కమిటీ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని తెలిపారు. అభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను నివేదికలో సూచించిందన్నారు. 13 జిల్లాలను 6 రీజియన్లుగా బోస్టన్ గ్రూప్ పరిశీలించిందన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. ఏపీకి 2.25లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. దేశంలోని బహుళ రాజధానులు, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై నివేదికలో ప్రస్తావించారు. రాష్ట్రంలో సమతుల్యాభివృద్ధి, సమగ్రాభివృద్ధిపై బీసీజీ నివేదికలో పొందుపరించింది. అలాగే ప్రస్తుత అమరావతి ప్రాంత అభివృద్ధి అంశాలను కూడా ప్రధానంగా నివేదికలో ప్రస్తావించింది. అభివృద్ధి సూచికల వారిగా జిల్లాల పరిస్థితులను సవివరంగా వివరించింది. వీటితో పాటు ప్రాంతాల వారిగా ఎంచుకోవల్సిన అభివృద్ధి వ్యూహాలను కూడా కమిటీ సభ్యులు వివరించారు. వ్యవసాయ, పారిశ్రామిక, టూరిజం, మత్స్య రంగాల్లో ప్రణాళికలను బీసీజీ పొందుపరించింది.
బీసీజీ కమిటీ నివేదిక హాస్యాస్పదం:బీజేపీ ఎంపీ సుజనా చౌదరి
రాష్ట్ర ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) కమిటీ నివేదిక సమర్పించడంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. బీసీజీ కమిటీ నివేదిక హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు, ఈ బీసీజీ కమిటీని ఎప్పుడు వేశారు?... అయినా మూడు రోజుల్లోనే నివేదిక రూపొందించగలరా? అంటూ సుజనా విస్మయం వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీలో ఆర్థిక అత్యయిక పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. రాజధానిని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని, 13 జిల్లాల ప్రజలు రాజధాని అమరావతిని కాపాడుకోవాలని సూచించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఏపీ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సమర్పించిన నివేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అమరావతిని చంపేయాలన్న దుర్బుద్ధితో గత ఐదేళ్లలో జగన్ రాసిన స్క్రిప్ట్ కు, బీసీజీ నివేదికకు తేడా ఏమీ లేదని తెలిపారు. అది బోస్టన్ రిపోర్ట్ కాదని, జగన్ బోగస్ రిపోర్ట్ అని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రకటనలనే జీఎన్ రావు, బీసీజీ కమిటీల నివేదికల్లో పొందుపరిచారని, వీటి విశ్వసనీయత ఏపాటిదో కోర్టుల ముందు తేలిపోతుందని పేర్కొన్నారు.
ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ
పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరించేలా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక ఉందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే సమయం ఇదని, ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే మూడు రాజధానుల ఏర్పాటును కమిటీ సిఫారసు చేసిందని అన్నారు. పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంటుంటే రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాజధాని రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. హైపవర్ కమిటీ ఈ నెల 6న సమావేశమవుతుందని, జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తామని చెప్పారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)