BJP List: ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్టులో నేరచరితులు, వారసులు, ఓటమిపాలైన వాళ్లు కూడా..
ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది.
Newdelhi, Aug 18: త్వరలో ఐదు రాష్ట్రాలకు (Five States) జరగనున్న ఎన్నికల (Elections) కోసం బీజేపీ (BJP) ముందుగానే సిద్ధమైంది. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh), మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఎన్నికల బరిలో దిగనున్న తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. వెనుకబడిన వర్గాల్లో పట్టుసాధించే ఉద్దేశంతో తొలి జాబితాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి సీట్లు కేటాయించింది.
ఓటమిపాలైన వాళ్లకు కూడా
గత ఎన్నికల్లో ఓటమి పాలైన 14 మంది అభ్యర్థులకు మరో చాన్స్ ఇచ్చింది. అంతేకాదు, రాజకీయ వారసులతోపాటు నేరచరిత్ర ఉన్న వారికి కూడా టికెట్లు కేటాయించడం గమనార్హం. బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన ప్రీతమ్ సింగ్ లోధీ, సబల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే మొహర్బన్ సింగ్ రావత్ కోడలు సరళా రావత్ తదితరులు కూడా ఉన్నారు.