Eknath Shinde Govt Gets Relief: బల నిరూపణకు ముందే రాజీనామా చేశారు, ఉద్ధవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం, షిండేనే సీఎంగా కొనసాగుతారని సుప్రీంకోర్టు తీర్పు
ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది
Mumbai: మహారాష్ట్ర( Maharashtra ) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను(Uddhav Thackeray) తిరిగి నియమించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది.శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్ థాకరే వర్గం, షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. ఎమ్మెల్యేలు మహావికాస్ అగాఢీ ప్రభుత్వం నుంచి బయటికి వెళ్లారన్న మెటీరియల్ లేకుండా, గవర్నర్ బలపరీక్ష అడగడాన్ని తప్పుపట్టింది. ఉద్ధవ్ థాక్రే మెజారిటీ కోల్పోయారని గవర్నర్ నిర్ధారణకు రావడం సరికాదని వ్యాఖ్యానించింది. కొత్త విప్ నియామకం చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అనర్హత పిటిషన్లకు , ఎన్నికల సంఘం ప్రొసీడింగ్స్‌కు మధ్య సంబంధం లేదని తెలిపింది.
థాకరే రాజీనామా చేయడంతో.. అప్పటికే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ మద్దతున్న ఏక్‌నాథ్ షిండే వర్గంతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం సమర్థనీయమే ’అని వెల్లడించింది.ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తాము అనర్హత వేటు వేయలేమని సుప్రీం వెల్లడించింది. ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండేనే సీఎంగా కొనసాగుతారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు.. రెబల్ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా లేదా అన్న అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది.కేసును నబం రేజియా జడ్జిమెంట్, అనర్హత పిటిషన్లు పెండింగ్, స్పీకర్ పాత్ర తదితర అంశాలను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.