Jharkhand Election Results: చిత్తయిన బీజేపీ, 47 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి, 25 స్థానాలకు పరిమితమైన బీజేపీ, రఘుబర్ దాస్ రాజీనామా, నూతన ముఖ్యమంత్రి కానున్న హేమంత్ సోరెన్
జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి (JMM-Congress-RJD) మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మెజారిటీ (41) స్థానాలను కూటమి అధిగమించి 47 సీట్లు (ఆధిక్యం+విజయం)సాధించింది. బీజేపీ (BJP)పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జేవీఎం(JVM) 3, ఏజేఎస్‌యూ(AJSU) 2, ఇతరులు స్థానాల్లో గెలుపొందారు.
Ranchi, December 24: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Jharkhand Assembly Elections 2019) బీజేపీకి షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి (JMM-Congress-RJD) మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన మెజారిటీ (41) స్థానాలను కూటమి అధిగమించి 47 సీట్లు (ఆధిక్యం+విజయం)సాధించింది. బీజేపీ (BJP)పార్టీ 25 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు జేవీఎం(JVM) 3, ఏజేఎస్‌యూ(AJSU) 2, ఇతరులు స్థానాల్లో గెలుపొందారు.
సీఎం రఘబర్‌దాస్‌తో ( Raghubar Das)పాటు ఆయన కేబినెట్‌లో ఉన్న ఆరుగురు మంత్రులు, స్పీకర్ ఓటమి పాలయ్యారు. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ (Hemant Soren) పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైనట్లేనని తాజా ఫలితాలు చెప్తున్నాయి.
ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి పదవికి రఘువర్‌దాస్ రాజీనామా చేశారు. ఫలితాల అనంతరం సోమవారం సాయంత్రం 7 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ద్రౌపది మూర్మాకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.
కాగా ఫలితాలపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడీ పాలనపై ప్రజా తీర్పు వెలువడిందని అభిప్రాయపడుతున్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల్లో పాలక బీజేపీ ఘోర పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్ ప్రకటించారు. ఇది కేవలం తన ఓటమి అని, బీజేపీది కాదని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీ నుంచి చేజారిన రెండు రాష్ట్రాలు
రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కారు రెండు రాష్ట్రాలను చేజార్చుకుంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిల్లో మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోగా ఇప్పుడు జార్ఖండ్ లో కూడా అధికారాన్ని కోల్పోయింది. హర్యానాలో మాత్రం మెజారీటీ రాకపోయినా జేజేపీతో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో జార్ఖండ్ లో బీజేపీకి 55శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అది 33 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం, అయోధ్య రామమందిరం, వంటి అంశాలు బీజేపీకి అనుకూలంగా మారినప్పటికీ పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్‌ఆర్సీ ఆ పార్టీకి కొంచెం ప్రతికూల ఫలితాలు ఇచ్చినట్లు జార్ఖండ్ ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది.
కాగా ఈ ఎన్నికల్లో విపక్షాలు భారీగా పుంజుకున్నాయి. 2014 ఎన్నికల్లో 19 స్థానాలు సాధించిన విపక్షాలు ఈ సారి 30 స్థానాల్లో విజయకేతనం ఎగరవేశాయి. కాంగ్రెస్ 6 స్థానాల నుంచి 16 స్థానాలకు ఎగబాకింది. ఇక బీజేపీ 37 స్థానాల నుంచి 25 స్థానాలకు పడిపోయింది. జేవీఎం 8 స్థానాల నుంచి 3 స్థానాలకు ఏజేఎస్‌యూ 5 నుంచి రెండు స్థానాలకు పరిమితమయ్యాయి.
అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్-జేఎంఎం కూటమికి అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్నారు. పాలనలో కూటమికి అంతామంచి జరగాలని వారు ఆకాంక్షించారు. జార్ఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ ప్రకటన విడుదల చేశారు.