KCR Meets Uddhav: ఇది ఆరంభం మాత్రమే! త్వరలోనే అన్ని పార్టీల నేతల మీటింగ్, ఉద్దవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ప్రతీకార రాజకీయాలు మంచివి కావన్న ఇరువురు సీఎంలు
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం ముంబయి వచ్చిన సీఎం కేసీఆర్... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రేతో (Uddhav Thackeray) చర్చించారు.
Mumbai, Feb 20: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ(Regional parties) ఏకతాటిపైకి రావాల్సిన సమయమిదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఆదివారం ముంబయి వచ్చిన సీఎం కేసీఆర్... జాతీయ రాజకీయాలపై ఉద్ధవ్ ఠాక్రేతో (Uddhav Thackeray) చర్చించారు. అనంతరం ఇద్దరు సీఎంలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... దేశంలో రావాల్సిన మార్పులపై చర్చించినట్టు చెప్పారు. ఇంకా అనేక మంది ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల పూర్తయిన తర్వాత కూడా దేశంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని అన్నారు సీఎం కేసీఆర్.
దేశంలో అనేక మార్పులు రావాల్సి ఉందన్నారు. దేశ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్ధవ్ ఠాక్రేతో చర్చించినట్టు వివరించారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్న సీఎం కేసీఆర్... వైఖరి మార్చుకోకుంటే బీజేపీకు (BJP) ఇబ్బందులు తప్పవన్నారు.
‘‘తెలంగాణ, మహారాష్ట్ర సోదర రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల మధ్య వెయ్యి కి.మీ మేర ఉమ్మడి సరిహద్దు ఉంది. రెండు రాష్ట్రాలు మంచి అవగాహనతో ముందుకు నడవాల్సిన అవసరముంది. ఉద్ధవ్ ఠాక్రేను హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించా’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ... ‘‘ఈ చర్చలు ఆరంభమే మున్ముందు పురోగతి లభిస్తుంది. మా చర్చల్లో రహస్యమేమీ ఉండదు. దేశంలో మార్పు కోసం ఏం చేసినా బహిరంగంగానే చేస్తాం. దేశంలో ప్రస్తుతం ప్రతీకార రాజకీయం నడుస్తోంది. ప్రతీకార రాజకీయాలు దేశానికి మంచిది కాదు. సోదర రాష్ట్రాలైన మహారాష్ట్ర, తెలంగాణ కలిసి నడుస్తాయి. సీఎం కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తదితరులు ఉన్నారు