2024 భారతదేశం ఎన్నికలు: 93 స్థానాల్లో కొనసాగుతున్న మూడో దశ లోక్ సభ పోలింగ్.. అహ్మదాబాద్ లో ఓటేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈ పోలింగ్ షురూ అయ్యింది.
Newdelhi, May 7: 2024 లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు (మంగళవారం) మూడో దశ పోలింగ్ (Third Phase Polling) మొదలైంది. 10 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్ సభ నియోజకవర్గాల్లో (Loksabha Elections) ఈ పోలింగ్ షురూ అయ్యింది. ఈ దశలో మొత్తం 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో సుమారు 120 మంది మహిళలు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ మొదలైంది. వేసవితాపం నేపథ్యంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఈ 93 స్థానాల్లోని 72 సీట్లను బీజేపీ గెలుచుకుంది.
ఓటు వేసిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాసేపటి క్రితం తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. స్వరాష్ట్రమైన గుజరాత్ లో వీరు ఓటు వేశారు. అహ్మదాబాద్ లో ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేశారు. ఈ క్రమంలో కార్యకర్తలు పెద్దయెత్తున హాజరయ్యారు.