Nitish Kumar as Next CM of Bihar: బీహార్ సీఎంగా రేపే నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం, ఏడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ అధినేత, డిప్యూటీ సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్
ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు.
Patna, November 15: బీహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ మరోసారి (Nitish Kumar as Next CM of Bihar) చేపట్టబోతున్నారు. ఆదివారం జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు గురించి ఈ సమావేశంలో చర్చించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర ఎన్డీయే పక్షాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీయే శాసన సభ్యుల సమావేశానికి ముందు జేడీయూ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నితీశ్ కుమార్‌ను జేడీయూ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (Nitish Kumar) రేపే బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మధ్యాహ్నం మధ్యాహ్నం గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి బయటకు వచ్చిన తర్వాత నితీశ్ తన ప్రమాణస్వీకారం విషయాన్ని ప్రకటించారు. తనతోపాటు కొందరు ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నితీశ్ తెలిపారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం.
Here's ANI Tweets
ఎన్డీఏ కూటమి (NDA) తరఫున శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన వెంటనే నితీశ్‌కుమార్.. కూటమి నేతలు ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ ఫగు చౌహాన్‌ను కలిసి తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతూ వినతిపత్రం సమర్పించారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లతో ఆయనకు ఒక జాబితాను అందజేశారు. గవర్నర్ అంగీకారంతో రేపు బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ఇక తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీశ్ కుమార్ అని ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. జేడీయూకు బీజేపీ కన్నా తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నేతలు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కాగా నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు (Chief Minister For 7th Time) సిద్ధమయ్యారు.
బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో (Bihar Assembly Elections 2020) ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి. జేడీయూ, బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎం కలిసి బిహార్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశాయి.
ఏడవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న జేడీయూ అధినేత
బీహార్ సీఎంగా 2000 వ సంవత్సరంలొ ఓ సారి 8 రోజులు ఉన్నారు. అదే సంవత్సరంలొ మరోసారి 11 రోజులు ఉన్నారు. 2005, 2010లో సీఎంగా కొనసాగారు. తిరిగి 2015లో రెండుసార్లు సీఎంగా ప్రమాణం చేశారు. 2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. 2005 నవంబర్ నుంచి 2020 వరకు బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు.
డిప్యూటీ సీఎంపై కొనసాగుతున్న సస్పెన్స్
బిహార్ ముఖ్యమంత్రి పదవిని నితీశ్ కుమార్ చేపట్టబోతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవే ఎవరికి వరిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తిదాయకంగా మారింది. ఇప్పటి వరకూ సీనియర్ నేత సుశీల్ మోదీ ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. అయితే బీజేపీ ఈ సారి ఆయనకు అవకాశం ఇస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. తాజాగా సుశీల్ మోదీకి బదులుగా డిప్యూటీ సీఎంగా మరో సీనియర్ నేత కామేశ్వర్ చౌపాల్‌ను తెరపైకి తీసుకువచ్చినట్లు సమాచారం.
సీఎంగా నితీశే కొనసాగుతారని ప్రకటించిన తర్వాత... డిప్యూటీ సీఎం ఎవరని విలేకరులు ప్రశ్నించగా ‘‘దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.’’ అని రాజ్‌నాథ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే సుశీల్ మోదీని బీజేపీ అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడింది. డీప్యూటీ ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పటికైతే సస్పెన్స్ కర అంశంమే..