Patna, November 11: కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా పతాక శీర్షికల్లోకి ఎక్కిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ పోరులో (Bihar Assembly Election Results 2020) చివరకు అధికార ఎన్డీయే (NDA) విజయకేతనం ఎగుర వేసింది. చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన ఆర్జేడీ (RJD) నేతృత్వంలోని మహా కూటమి విజయానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారంలోకి రానుంది. ఆర్జేడీ పార్టీ అత్యధికంగా 75స్థానాలు గెలుచుకుంది. రెండో స్థానంలో బీజేపీ 74 సీట్లతో నిలిచింది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ (JDU) ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది.
కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 74, జేడీయూ 43, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) 4, హెచ్‌ఏఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. విపక్ష మహా కూటమిలో ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. విజయం మహా కూటమిదేనని, కాబోయే ముఖ్యమంత్రి తేజస్వీ యాదవేనని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ వాటి అంచనాను తలక్రిందులు చేస్తూ ఎన్డీయే విజయం సాధించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది.
2015లో ఆర్జేడీతో కలిసి పోటీచేసి అధికారంలోకి వచ్చిన జేడీయూ.. రెండేళ్లకే ఆర్జేడీతో విభేదించి, బీజేపీకి చేరువై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నితీశ్‌తో విబేధించి, ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, సొంతంగా బరిలో నిలిచిన లోక్‌జన శక్తి పార్టీ(ఎల్జేపీ) ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకుంది. కానీ, సుమారు 30 సీట్లలో శత్రు పక్షం జేడీయూ విజయావకాశాలను ఎల్జేపీ దెబ్బతీయగలిగిందని భావిస్తున్నారు.
43 సీట్లకే పరిమితమైన జేడీయూ
2015లో 71 సీట్లు సాధించిన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఇప్పుడు 43 సీట్లకే పరిమితమైంది. నితీష్‌కుమార్‌కు మహా దళితులు, ఎంబీసీలు, మహిళలు అండగా నిలవడం వల్లే ఈ 43 సీట్లు అయినా దక్కించుకోగలిగారు. ఎల్‌జేపీ ఎన్డీయే కూటమి నుంచి వీడి విడిగా పోటీచేయడం వంటి కారణాల వల్ల 2015 నాటి స్థాయిలో జేడీయూ సీట్లు గెలుచుకోలేకపోయింది. యాదవ సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లాలూప్రసాద్‌యాదవ్‌కు మద్దతు పలికింది.
అయితే కుర్మి సామాజిక వర్గం నుంచి సంపూర్ణ మద్దతు నితీష్‌కుమార్‌కు లభించలేదు. కేవలం అత్యంత వెనకబడిన కులాలు, మహాదళితుల నుంచి నితీశ్‌కు మద్దతు లభించింది. అత్యంత బలహీన తరగతులకు ఓబీసీల్లో ప్రత్యేక గుర్తింపు, మహాదళితులకు ఎస్సీల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో వారు నితీష్ వెన్నంటి నిలిచారు. అందుకే ఈ సీట్లు అయినా గెలుచుకోగలిగారని విశ్లేషకులు చెబుతున్నారు.
19 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ
70 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. పోటీ చేసిన సీట్లలో కనీసం మూడో వంతు కూడా గెలవలేకపోయింది. వామపక్షాలు మొత్తం 29 సీట్లలో పోటీ చేసి 16 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందులో సీపీఐ(ఎంఎల్) 12, సీపీఐ 2, సీపీఎం 2 సీట్లు గెలుచుకున్నాయి. ఒకప్పుడు బిహార్‌లో వామపక్ష పార్టీలు బలమైన శక్తిగా ఉన్నప్పటికీ, గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డాయి. 2010లో కేవలం సీపీఐ ఒక సీటు మాత్రమే గెలుచుకోగా.. 2015లో సీపీఐ(ఎంఎల్) మూడు సీట్లు గెలవగలిగింది.
ఐదు సీట్లు గెలుచుకుని సత్తా చాటిన ఎంఐఎం
అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. 2015లో ఇక్కడ ప్రస్తానం ప్రారంభించిన పార్టీ ఈ ఎన్నికల్లో తన ఉనికి చాటుకుంది. అమౌర్‌లో జేడీయూపై(గతంలో కాంగ్రెస్ స్థానం), బహదూర్‌గంజ్(గతంలో కాంగ్రెస్ స్థానం)లో వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీపై, బైసీలో బీజేపీపై(గతంలో ఆర్జేడీ సీటు), జోకిహాట్‌లో ఆర్జేడీపై(గతంలో జేడీయూ), కొచ్చదామన్‌లో జేడీయూ(గతంలోనూ జేడీయూ సీటు)పై ఎంఐఎం గెలిచింది.
ఎన్నికల్లో చతికిలపడిన లోక్‌జన్‌శక్తి పార్టీ
దివంగత రాంవిలాస్‌పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జన్‌శక్తి పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కింగ్‌మేకర్ కావాలనుకున్న చిరాగ్ పాశ్వాన్ ఆశలు ఆవిరయ్యాయి. కేవలం ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
బీజేపీని ప్రజలు గొప్పగా ఆశీర్వదించారు : ప్రధాని మోదీ
ఫలితాల అనంతరం మోదీ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీని ప్రజలు గొప్పగా ఆశీర్వదించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలోని దుబ్బాక నియోజకవర్గంలో చరిత్రాత్మక విజయం దక్కిందన్నారు. కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలుపు బీజేపీకి ప్రత్యేకం అని పేర్కొన్నారు. గుజరాత్ ప్రజలు, బీజేపీ మధ్య ఉన్న బంధం విడదీయరానిదని గుర్తుచేశారు. ఎనిమిది స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో వారు తమపై అభిమానం, ఆప్యాయతను చూపించారని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రగతిశీల అజెండా, బీజేపీ రాష్ట్ర శాఖ కఠోరమైన శ్రమతో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించగలిగామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాహిత విధానాలు బీజేపీని ప్రజలకు చేరువ చేశాయని వెల్లడించారు.