BJP Raghunandan Rao (Photo-Twitter)

Dubbaka, Nov 10: ఉద్యమ గడ్డపై కాషాయం రెపరెపలాడింది. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పై స్వల్ప మెజార్టీతో గెలిచింది. కాగా దుబ్బాక ఉపఎన్నికల ఫలితం రెండు పార్టీల మధ్యనే దోబూచులాడింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క రౌండ్ లో ఆధిక్యం కనపరిచిందే తప్ప మరెక్కడా పోటీలో లేదు. తొలి రౌండ్ నుంచి బీజేపీ-టీఆర్ఎస్ నువ్వా నేనా (Dubbaka By-election Result 2020) అన్నట్లుగా సాగాయి.

తొలుత కాషాయపు పార్టీ (Bharatiya Janata Party (BJP) ఆధిక్యాన్ని కనపర్చగా తరువాత ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Samithi (TRS) పుంజుకుంది. అయితే చివరి రౌండ్లలో కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచినప్పటికీ చివరి వరకు బీజేపీనే ఎక్కువ ఆధిక్యత కనపరిచింది. బిజేపీ అభ్యర్థ రఘునందన్ రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలీపేట్ సుజాతపై 1470 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 1,64,186 ఓట్లు పోల‌వ్వ‌గా, బీజేపీకి 62,772, టీఆర్ఎస్ పార్టీకి 61,302, కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల‌య్యాయి.  పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం 1453 పోల‌వ్వ‌గా, అందులో 1381 ఓట్లు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యాయి. చెల్లుబాటైన ఓట్ల‌లో టీఆర్ఎస్ పార్టీకి 720, బీజేపీకి 368, కాంగ్రెస్ పార్టీకి 142 ఓట్లు పోల‌య్యాయి. స్వ‌తంత్ర అభ్య‌ర్థి బండారు నాగ‌రాజుకు 60 ఓట్లు వ‌చ్చిన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

రౌండ్ల వారీగా వివరాలను ఓ సారి చూస్తే...

22వ రౌండ్‌లోనూ 438 ఓట్ల అధిక్యాన్ని బీజేపీ సాధించింది. 22వ రౌండ్ పూర్తయ్యేసరికి 1058 ఓట్ల అధిక్యంలో కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 61,119 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 60,061 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 21,239 ఓట్లు లభించాయి.

21వ రౌండ్ లో బీజేపీకి అధిక్యం లభించింది. దీంతో 21 రౌండ్ పూర్తయ్యేసరికి 380 ఓట్ల అధిక్యంలో బీజేపీ ఉంది. మొత్తం 21 రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 620 ఓట్ల అధిక్యంలో కొనసాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 58,161 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 57,541 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 20,268 ఓట్లు లభించాయి.

బీహార్‌లో బీజేపీ దూకుడు, అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం, ఎన్డీయే కూటమికి బీహారీలు పట్టం కట్టబోతున్నారా ? 129 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం, మహాఘట్ బంధన్ 99 స్థానాల్లో ఆధిక్యం

20వ రౌండులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 551 ఓట్ల ఆధిక్యతను సాధించారు. ఈ రౌండులో బీజేపీకి 2,931 ఓట్లు రాగా, టీఆర్ఎస్ కు 2,440 ఓట్లు పడ్డాయి. 19వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 425 ఓట్ల ఆధిక్యం లభించింది.19వ రౌండ్ పూర్తయ్యే సమయానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 53,053 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 52,802 ఓట్లు.. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 18,365 ఓట్లు లభించాయి

17, 18వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగింది. 17 రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 872 ఓట్ల ఆధిక్యం లభించింది. 18వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 688 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా.. 18వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 174 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 50,467 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 50,293 ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 17,389 ఓట్లు లభించాయి

16వ రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు 749 ఓట్ల ఆధిక్యం లభించింది. దుబ్బాకలో 16వ రౌండ్‌ కౌంటింగ్‌ లో 1,734 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 45,994 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 44,260 ఓట్లు.. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 14,832 ఓట్లు లభించాయి.

తొలి ఐదు రౌండ్లు, 8, 9, 11 రౌండ్ల‌లో బీజేపీ మెజార్టీ సాధించ‌గా, టీఆర్ఎస్ పార్టీ 6, 7, 13, 14, 15,16 రౌండ్ల‌లో భారీ మెజార్టీగా దిశ‌గా దూసుకెళ్లింది. 15, 16 రౌండ్ల‌లో 1500 మెజార్టీ సాధించి.. విజ‌యం దిశ‌గా వెళ్తుంది. 15వ రౌండ్‌లో 955 ఓట్ల మెజార్టీ సాధించ‌గా, 16వ రౌండ్‌లో 749 ఓట్లు సాధించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవ‌లం 12వ రౌండ్‌లో ఆధిక్యం సాధించింది. 16 రౌండ్లు ముగిసేస‌రికి బీజేపీకి 1700 ఓట్ల మెజార్టీ మాత్ర‌మే ఉంది.

15వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 955 ఓట్ల ఆధిక్యం లభించింది. 14వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 288 ఓట్ల ఆధిక్యం లభించింది.13వ రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ 304 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 12వ రౌండ్‌లో 83 ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి సాధించారు. 11వ రౌండ్‌లో కేవలం 199 ఓట్లు మాత్రమే రఘునందన్‌కు వచ్చాయి,

పదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యంలోకి వచ్చారు. ఈ రౌండ్‌లో 456 ఓట్ల ఆధిక్యాన్ని టీఆర్ఎస్ సాధించింది. పదో రౌండ్ పూర్తయ్యే సరికి 3,734 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఉన్నారు. 9వ రౌండ్‌లో బీజేపీకే ఆధిక్యం వచ్చింది. 1084 ఓట్లు ఈ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థికి వచ్చాయి. ఎనిమిదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం 621 అధిక్యంలో కొనసాగారు.

మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరవ రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు.