Tamil Nadu, October 7: తమిళనాడులోని అధికారిపార్టీ అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రస్తుత సీఎం పళనిస్వామికి (Edappadi K. Palaniswami) మరో అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరునే ఎంపిక చేశారు. ఈమేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం (Deputy Chief Minister Panneer Selvam) ప్రతిపాదించారు. పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్ సెల్వంకు అప్పగించారు. 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ అన్నాడీఎంకే చీఫ్‌ను నిర్ణయించనుంది.ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలపై పళనిస్వామి, పన్నీర్ సెల్వం సంతకాలు చేశారు. ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఆరుగురు, పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఐదుగురు ఉన్నారు.
2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు (Tamil Nadu Assembly Elections 2021) జరగనున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో ఇప్పటి వరకు భారీ ఎత్తున వివాదం నడిచింది. నేనంటే నేనంటూ పళనిస్వామి, పన్నీర్ సెల్వం పరోక్షంగా ప్రకటనలిచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ పళనిస్వామికి అవకాశం (AIADMK Names Edappadi K Palaniswami as CM Candidate) దక్కడంతో సస్పెన్స్ వీడింది
వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం (Tamil Nadu Assembly Elections) పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి. కాగా సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య గత కొంతకాలంగా విబేధాలు తలెత్తాయి. దీంతో సీనియర్ మంత్రలు, పార్టీ నేతలు ఇరువురి మధ్య రాజీ ప్రయత్నాలు చేసి.. సద్దుమణిగేలా చేశారు.
సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై సెప్టెంబర్ 28 అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వాగ్వాదానికి దిగడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేగింది. సీఎం అభ్యర్థిగా తననే ప్రకటించాలని బెట్టుచేసిన పన్నీర్‌సెల్వం పట్టుసడలించారు. ఇద్దరు నేతలు సీఎం ఛాన్స్‌కోసం తగవులాడుకోవడంతో పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు ఒకింత వేదన చెందారు. దీని తర్వాత పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎడప్పాడికి దూరమయ్యారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజర య్యారు. ఇలా అలకపాన్పు వహించిన ఓపీఎస్‌ను బుజ్జగించేందుకు సీనియర్ మంత్రులు ఆయన నివాసంలో పలు విడతలుగా చర్చలు జరిపారు. మొత్తానికి ఇవాళ జరిగిన మీటింగ్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే సీఎం అభ్యర్థిగా పార్టీ నేతలు నిర్ణయించి.. అధికారికంగా ప్రకటించారు.