West Bengal Assembly Election Results 2021: కంగ్రాట్స్ దీదీ..మీకు పూర్తిగా సహకరిస్తాం, టీఎంసీ ఘనవిజయంపై శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, నందిగ్రామ్‌లో పరాజయం పాలైన మమతా బెనర్జీ, నీచ రాజకీయాలకే బీజేపీ ఓటమి అంటూ దీదీ ఫైర్
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పశ్చిమబెంగాల్‌కు అన్నిరకాలుగా కేంద్రం సహాయ సహకారాన్ని (All Possible Support to the State) కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.
New Delhi, May 2: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ప్రధాని మోదీ అభినందలు (PM Narendra Modi Congratulates Mamata Banerjee) తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పశ్చిమబెంగాల్‌కు అన్నిరకాలుగా కేంద్రం సహాయ సహకారాన్ని (All Possible Support to the State) కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.
కోవిడ్ సమస్యను అధిగమించేందుకు పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. బెంగాల్‌లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు మోదీ (PM Modi) కృతజ్ఞతలు తెలియజేశారు. ఒకప్పుడు ఉనికి కూడా లేని స్థాయి నుంచి ఇప్పుడు బీజేపీ (BJP) కీలక పార్టీగా రూపాంతరం చెందిందని వ్యాఖ్యానించారు. పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను అభినందించారు.
అలాగే కేరళలో విజయం సాధించిన పినరయి విజయన్, ఆయన నేతృత్వంలోని కూటమి ఎల్‌డీఎఫ్‌కి కూడా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ సహా వివిధ అంశాల్లో కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కేరళలో బీజేపీకి ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే తమిళనాడులో విజయం సాధించిన డీఎంకే, ఆ పార్టీ అధినేత స్టాలిన్‌కు కూడా ప్రధాని అభినందనలు తెలియజేశారు. తమిళనాడు సంక్షేమం కోసం సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Here's PM Modi Tweets
కాగా, మమతా బెనర్జీ సాధించిన విజయంపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నేతలు, కేంద్ర నేతలు సైతం అభినందనలు తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే చీఫ్ స్టాలిన్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు అభినందనలు తెలిపారు.
ఉత్కంఠభరితంగా సాగిన నందిగ్రామ్ కౌంటింగ్‌లో చివరకు సువేందు అధికారి విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. టీఎంసీ అభ్యంతరంతో రీకౌంటింగ్ చేశామని.. సువేందు 1736 ఓట్ల తేడాతో దీదీపై గెలిచారని ఈసీ ప్రకటించింది. ఓవైపు రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయాలు అందుకున్న తరుణంలో, పార్టీ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమిపాలవడం పార్టీ వర్గాలకు మింగుడుపడని విషయమే.
పశ్చిమ బెంగాల్ లో 292 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల ప్రకారం టీఎంసీ 215 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 74 చోట్ల ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 147 కాగా, ఆ మార్కును టీఎంసీ ఎప్పుడో దాటేసింది. ఇక, ఈ ఎన్నికల ద్వారా బెంగాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని కలలు గన్న బీజేపీకి ఆశాభంగం తప్పలేదు. బీజేపీ 61 స్థానాల్లో నెగ్గి, మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
పశ్చిమ బెంగాల్ లో గెలుపు ఖాయమైన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో నీచ రాజకీయాలకు పాల్పడిన బీజేపీ ఓటమిపాలైందని అన్నారు. ఎన్నికల సంఘం రూపంలో తమకు భయానక అనుభవాలు ఎదురయ్యాయని, అన్నింటికి ఎదురొడ్డి నిలిచామని మమత అన్నారు. ఇది ప్రజలు అందించిన ఘనవిజయం అని, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. ఇక తాను వెంటనే కొవిడ్ కట్టడి చర్యల్లో నిమగ్నమవుతాయని మమత వెల్లడించారు.
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రమాణస్వీకారం కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, మీడియా సమావేశం ఆరంభంలో ఆమె జై బంగ్లా అంటూ గట్టిగా నినదించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విజయోత్సవ ర్యాలీలు, వేడుకలు జరుపుకోవద్దని టీఎంసీ శ్రేణులకు సూచించారు.