CWC Meet:సోనియమ్మ ఎలా చెబితే అలా! కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియానే ఉండాలి, సుధీర్ఘంగా సాగిన సీడబ్లూసీ సమావేశం, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై చర్చ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది సీడబ్లూసీ (CWC). ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సోనియా గాంధీపై (Sonia Gandhi)తమకు నమ్మకం ఉందని.. ఆమేనే తమకు నాయకత్వం అందిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడించారు.
New Delhi, March 13: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (Congress Working Committe) సమావేశం ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటూ, పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది సీడబ్లూసీ (CWC). ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సోనియా గాంధీపై (Sonia Gandhi)తమకు నమ్మకం ఉందని.. ఆమేనే తమకు నాయకత్వం అందిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పగ్గాలు సోనియా గాంధీ చేతిలోనే ఉన్నాయని స్పష్టమైంది. ఆదివారం సుమారు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే (Mallikarjuna Kharge) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భవిష్యత్ లో చర్యలు తీసుకుంటారని తెలిపారు.
పార్టీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారని, ఐదు రాష్ట్రాలపై సమగ్ర చర్చ జరిగిందని ఏఐసీసీ గోవా ఇన్ ఛార్జీ దినేష్ (Dinesh) తెలిపారు. 2024 లోక్ సభ ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనడానికి పార్టీ సిద్ధంగా ఉందని నేతలు ప్రకటించారు. సోనియాపై విశ్వాసాన్ని ఏకగ్రీవంగా సభ్యులు ప్రకటించారు. ఆమెనే ముందుండి కాంగ్రెస్ ను నడిపించాలని అభ్యర్థించిందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఓటమిపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం ఢిల్లీలో భేటి జరిగింది. చివరిసారిగా గత సంవత్సరం అక్టోబర్ 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సీడబ్ల్యూసీ (CWC) సమావేశానికి 57 మందికి ఆహ్వానం అందింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఘోర పరాజయానికి కారణాలు, భవిష్యత్తు వ్యూహాలు వంటి కీలక అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. ఈ కీలక సమావేశానికి గులాంనబీ ఆజాద్, ఆనంద్‌శర్మ సహా ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ పదవులకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గుడ్‌బై చెప్తారని టాక్ గుప్పుమంది. కానీ అలాంటిదేమీ లేకుండానే మీటింగ్ ముగిసింది.