West Bengal Assembly Elections 2021: ఒక్కసారి గెలిపించండి, రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌లా మార్చి చూపిస్తాం, మిడ్నాపూర్‌లో బహిరంగ సభలో అమిత్ షా, సుబేందుతో సహా ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో మిడ్నాపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో (Amit Shah in Midnapore) సుబేందు బీజేపీలో చేరారు. ఈయనతో పాటు ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
Kolkata, December 19: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (West Bengal Assembly Elections 2021) సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా టీఎంసీ నేతలను బీజేపీ ఆకర్షించుకుంటూ వెళుతోంది. తాజాగా తృణమూల్ మాజీ నేత, మమతా బెనర్జీకి (Mamata Banerjee) అత్యంత సన్నిహితుడైన సుబేందు అధికారి శనివారం బీజేపీలో (Suvendu Adhikari Joins BJP) చేరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో మిడ్నాపూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో (Amit Shah in Midnapore) సుబేందు బీజేపీలో చేరారు. ఈయనతో పాటు ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు అమిత్‌షాకు ధన్యవాదాలు. నాకు బీజేపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. టీఎంసీ నాయకత్వం నన్ను బాగా అవమానాలకు గురిచేసిందని సుబేందు మండిపడ్డారు. అంతకు పూర్వం సుబేందు అధికారి టీఎంసీ నాయకత్వానికి ఓ బహిరంగ లేఖ రాశారు. ఒక్క రోజులోనే తృణమూల్ (Trinamool Congress) నిర్మాణం జరగలేదు. ఏ ఒక్క వ్యక్తో దీనిని నిర్మించలేదు. పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రయత్నం. 10 సంవత్సరాలుగా పార్టీ నిర్మాణం కోసం చాలా శ్రమించాం.
ఆ ఫలితాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదంతా మరిచిపోయి, ప్రస్తుతం కొందరు పార్టీని తమ సొంత ఆస్తిలాగా భావిస్తున్నారు. అంతలా పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను ఇప్పుడు తీవ్రంగా అవమానిస్తున్నారు. వారిని పక్కన పెట్టేస్తున్నారు. అవతలి వ్యక్తుల సహాయాన్ని అర్థిస్తున్నారు. కార్యక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కలలు కంటున్నారు. వారికి త్యాగం గురించి ఏమాత్రం తెలియదు.’’ అంటూ పరోక్షంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు.
ఇక బహిరంగ సభలో హోం మంత్రి మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం అక్కడ బీజేపీదే అధికారమని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. దాదాపు 200కు పైగా సీట్లతో తాము బెంగాల్‌లో అధికారం చేపడతామని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ సీనియర్ నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తమ పార్టీలో చేరికలు పెరుగుతుండటంతో బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని మమతా దీదీ ఆరోపిస్తున్నారని, మరి ఆమె సొంత పార్టీ పెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించలేదా అని ప్రశ్నించలేదా అని షా ప్రశ్నించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ ఆమె ఒక్కరే మిగులుతారని ఆయన వ్యాఖ్యానించారు.
మీరు బెంగాల్ మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ చేతిలో పెట్టారు. ఆ తర్వాత 27 ఏండ్లు కమ్యూనిస్టులకు అప్పగించారు. గత పదేండ్లుగా మమతా దీదీకి అధికారం ఇచ్చారు. ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రం తలరాత మారలేదు. కానీ, ఒక్క ఐదేండ్లు బెంగాల్‌లో అధికారాన్ని బీజేపీకి ఇవ్వండి. మేం రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌లా మార్చి చూపిస్తాం అని ఓటర్లను అమిత్ షా కోరారు.
సువెందు అధికారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) నిర్ణయించింది. బీజేపీలో చేరిన వెంటనే ఈ ఉత్తర్వులు రావడం గమరార్హం. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలకనేతలు పార్టీని వీడటంతో మమతాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి సహా మిడ్నాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు.
మమతకు కుడిభుజంగా ఉన్న ముకుల్ రాయ్‌ను మూడేళ్ల క్రితమే తమ పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. ఇప్పుడు మరికొంతమంది టీఎంసీ ముఖ్యనేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు పావులు కదుపుతోంది. ముకుల్ రాయ్ సహకారంతో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ.. శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 294 అసెంబ్లీ సీట్లలో 200 మేర స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది
చంపుకోవడం, కొట్టుకోవడం భారతదేశ చరిత్ర కాదు, కలకత్తా పర్యటనలో ప్రధాని మోడీ
ఇదిలా ఉంటే హోం మంత్రి వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ విసిరింది. కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీని బహిష్కరించిన తర్వాత మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని స్థాపించారని, కాంగ్రెస్ నుంచి తప్పుకోలేదని, ఆ విషయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెలియదని తృణమూల్ ఎద్దేవా చేసింది. ఇతర పార్టీల నుంచి నేతలను బీజేపీ చేర్చుకుంటోందని మమతా అంటున్నారని, మమత కాంగ్రెస్‌ను వదిలి, తృణమూల్ ను ఏర్పాటు చేయలేదా? అని సూటిగా అడుతున్నాను అన్న అమిత్‌షా వ్యాఖ్యలకు కౌంటర్ గా తృణమూల్ పై వ్యాఖ్యలు చేసింది.
తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ... బెంగాల్ రాజకీయ చరిత్ర గురించి అమిత్‌షాకు ఏమాత్రం తెలియదని మండిపడ్డారు. మమతా బెనర్జీని కాంగ్రెస్ బహిష్కరించిన తర్వాత ఆమె కొత్త పార్టీని స్థాపించారని, ఈ విషయం అమిత్‌షాకు తెలియదన్నారు. కుటుంబ రాజకీయాల గురించి షా ప్రతిసారీ విరుచుకుపడుతుంటారని, కానీ సుబేందు అధికారి దగ్గరికి వచ్చే సరికి మాత్రం ఆ విమర్శను మరిచిపోతారని మండిపడ్డారు.
షా కుమారుడికి బీసీసీఐలో పదవి దక్కిందని గుర్తు చేస్తూ కల్యాణ్ బెనర్జీ చురకలంటించారు. మమత కుటుంబం నుంచి ఎవరికీ ముఖ్యమంత్రి పదవి లభించదని, ఈ సంగతి బెంగాల్ ప్రజలకు బాగా తెలుసని అన్నారు. సుబేందు అధికారి నిజంగానే పెద్ద నేత అయితే, 1996,2001,2004 లో జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో చెప్పారని కల్యాణ్ ప్రశ్నించారు.