UP Election Results 2022: లఖింపూర్ ఖేరీలో బీజేపీ క్లీన్ స్వీప్, రైతుల నిరసనలు ఏమయ్యాయని ప్రతిపక్షాలు షాక్, పార్టీ గెలిచినా అక్కడ యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం
అయితే యూపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటన (BJP wins all 8 seats in Lakhimpur Kheri district), ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపలేదు.
Lucknow, Mar 11: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (UP Election Results 2022) బీజేపీ 273 సీట్లను కైవసం చేసుకొని విజయదుందుభి మోగించింది. అయితే యూపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటన (BJP wins all 8 seats in Lakhimpur Kheri district), ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లఖింపూర్ ఖేరీ పరిధిలోని మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసి ప్రతిపక్షాలను విస్మయానికి గురి చేసింది. గత ఏడాది అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో రోడ్డు పక్కగా నిరసన చేస్తున్న రైతులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు, ఆశిష్ మిశ్రా తన కాన్వాయ్‌లోని వాహనంతో తొక్కించాడు. ఈ ఘటనతో పాటు ఆ వెంటనే చెలరేగిన హింసాకాండలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్ మరణించారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ఈ కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యంతో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రాను చాలా రోజుల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఘటన ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. లఖింపూర్ ఖేరీ పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలైన పాలియా, నిఘాసన్, గోలా గోకర్నాథ్, శ్రీ నగర్, ధౌరాహ్రా, లఖింపూర్, కస్తా, మొహమ్మది సీట్లను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. రైతులతోపాటు యూపీలోని విపక్ష పార్టీలను ఇది విస్మయానికి గురి చేసింది.
తాజా ఫలితాల్లో యూపీ డిప్యూటీ సీఎంతో సహా 11మంది రాష్ట్ర మంత్రులు ఘోర పరాజయం పాలయ్యారు. సగం కంటే అధిక స్థానాలను కైవసం చేసుకొని ఘన విజయం సాధించిన అధికార బీజేపీకి 11 మంది మంత్రులు ఓటమి పాలవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యాతోపాటు మరో 10 మంది మంత్రులు ఓటమి చవిచూశారు.గడచిన 30 ఏళ్లలో రెండవసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించినా 11 మంది ఓటమి అధికార బీజేపీకి మింగుడు పడటం లేదు.
సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య 7,337 ఓట్ల తేడాతో సమాజ్ వాదీ పార్టీకి చెందిన పల్లవి పటేల్ చేతిలో ఓడిపోయారు.అలాగే యూపీ చెరకుశాఖ మంత్రి సురేశ్ రాణా షామ్లీ జిల్లాలోని థానా భవన్ సీటులో ఆర్‌ఎల్‌డీకి చెందిన అష్రఫ్ అలీ ఖాన్ చేతిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బరేలీ జిల్లాలోని బహేరీ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అతౌర్ రెహ్మాన్ చేతిలో ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ 3,355 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్ అలియాస్ మోతీ సింగ్ ప్రతాప్‌గఢ్‌లోని పట్టి స్థానం నుంచి పోటీ చేసి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ సింగ్ చేతిలో 22,051 ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఆదిత్యనాథ్ ప్రభుత్వంలోని మరో మంత్రి చంద్రికా ప్రసాద్ ఉపాధ్యాయ్ చిత్రకూట్‌లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి చెందిన అనిల్ కుమార్ చేతిలో 20,876 ఓట్ల తేడాతో ఓడిపోయారు. బల్లియా జిల్లాలోని బరియా స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జైప్రకాష్ ఆంచల్ చేతిలో ఆనంద్ స్వరూప్ శుక్లా 12,951 ఓట్ల తేడాతో ఓడిపోయారు. శుక్లా గతసారి బల్లియా స్థానం నుంచి పోటీ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స్థానంలో బరియా స్థానం నుంచి ఈసారి శుక్లా బరిలో నిలిచి ఓటమి చెందారు.
యూపీ రాష్ట్ర క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ బల్లియాలోని ఫెఫ్నా స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సంగ్రామ్ సింగ్ చేతిలో 19,354 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ మంత్రి రణ్వేంద్ర సింగ్ దున్నికి పరాభవం ఎదురైంది. ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్ స్థానంలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఉషా మౌర్య చేతిలో రణవేంద్ర సింగ్ దున్ని 25,181 ఓట్ల తేడాతో ఓడిపోయారు.