Uttar Pradesh Election Results 2022: యూపీలో బీజేపీ దండయాత్ర, పూర్తయిన కౌంటింగ్, 273 స్థానాల్లో బీజేపీ కూటమి ఘన విజయం, హోలీ ముందే వచ్చిందన్న మోడీ

New Delhi, March 10: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు(UP Election Final Result) వచ్చేశాయి. ఈ సారి యూపీలో బీజేపీ (BJP) దండయాత్ర చేసింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 273 స్థానాల్లో కమలం వికసించింది.మొత్తం 403 అసెంబ్లీ సీట్లు క‌లిగిన యూపీ అసెంబ్లీ (UP Assembly)ఎన్నిక‌ల కౌంటింగ్ గురువారం ఉద‌యం నుంచి రాత్రి దాకా కొన‌సాగింది. కౌంటింగ్ (Counting)మొద‌లైన కాసేప‌టికే విజ‌య‌మెవ‌రిదో స్ప‌ష్ట‌మైపోయినప్పటికీ.. అంతిమ ఫ‌లితాలు రావ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. రాత్రి 9.30 గంట‌ల స‌మ‌యానికి యూపీ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఓట్ల లెక్కింపు పూర్తి కావ‌డానికి ముందే మ్యాజిక్ ఫిగ‌ర్(202) ను దాటేసిన బీజేపీ(BJP).. కౌంటింగ్ పూర్తయ్యే స‌రికి ఏకంగా 273 సీట్ల‌ను గెలుచుకుంది. ఇక బీజేపీకి గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నుకున్న స‌మాజ్ వాదీ పార్టీ (Samajwai Party) 125 సీట్ల దగ్గరే ఆగిపోయింది. గ‌తంలో యూపీలో అధికారాన్ని చెలాయించిన బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ సింగిల్ సీటుకే ప‌రిమిత‌మైపోయింది. ఇక గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ (Congress) కూడా కేవలం రెండు సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఇత‌రులు రెండు సీట్ల‌లో విజ‌యం సాధించారు. మొత్తంగా పెద్ద‌గా సంచ‌ల‌నాలేమీ లేకుండానే యూపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల మాదిరే వెలువ‌డ్డాయి. యూపీలో గెలుపు బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. రెండోసారి అధికారం దక్కడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ప్రధాని మోదీ(Prime Minister Modi) పాల్గొన్నారు. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫలితాల‌పై ప్ర‌ధాని మోదీ స్పందించారు. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితం ప్ర‌జాస్వామ్య విజ‌య‌మ‌ని అన్నారు. మ‌హిళ‌లు, యువ‌త బీజేపీకి అండ‌గా నిలిచార‌ని మోదీ (Modi) అన్నారు.

UP Election Results 2022: యోగీ దెబ్బకు పాత రికార్డులన్నీ బద్దలు, వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించనున్న యోగీ ఆదిత్యనాథ్

“ఇది ప్ర‌జాస్వామ్య విజ‌యం. మ‌హిళ‌లు, యువ‌త బీజేపీకి అండ‌గా నిలిచారు. తొలిసారి ఓటేసిన యువ‌కులు బీజేపీకి ప‌ట్టం క‌ట్టారు. గోవాలో అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. గోవా ప్ర‌జ‌లు మూడోసారి బీజేపీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. ఉత్త‌రాఖండ్‌లో(Uttarakhand) ఫ‌స్ట్ టైమ్ బీజేపీ వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ పాల‌నా తీరును మెచ్చి ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు. పేద‌రికం నిర్మూల‌న అంటూ చాలా నినాదాలు, స్కీంలు వ‌చ్చాయి. కానీ అవేవీ వ‌ర్క‌వుట్ కాలేదు. పేద‌రికాన్ని తొల‌గించేందుకు బీజేపీ చిత్త‌శుద్దితో ప‌నిచేసింది. పేద‌ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందేవ‌ర‌కు నేను వ‌దిలిపెట్ట‌ను” అని మోదీ ఉద్వేగ‌పూరిత ప్ర‌సంగం చేశారు.

”ఇవాళ వెలువడిన ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు(Loksabha Elections) ప్రతిబింబం. ఈసారి హోలీ మార్చి 10నే మొదలైంది. బీజేపీ శ్రేణులకు అభినందనలు. సుపరిపాలన వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. బీజేపీ విజయంలో మహిళలు, యువతది కీలకపాత్ర” అని మోదీ అన్నారు. ‘‘37 ఏళ్ల తర్వాత యూపీలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. యూపీ ప్రజలు 2014 నుంచి అభివృద్ధికే ఓటేశారు. 2017 యూపీ ఫలితాలు 2019 ఫలితాలను చూపాయి. 2022 యూపీ ఫలితాలు 2024 ఎన్నికలను చూపాయి. యూపీ ప్రజలు దేశ విచ్ఛిన్నకర శక్తులను దూరం పెట్టారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఉన్న చోట ప్రజా క్షేమమే ధ్యేయంగా పాలన ఉంది. ఈ ఎన్నికలు చాలా సంక్లిష్ట సమయంలో జరిగాయి. కరోనా మహమ్మారితో పోరాడుతున్న వేళ ఈ ఎన్నికలు వచ్చాయి. మేం తీసుకున్న చర్యల వల్ల కరోనా సంక్షోభం నుంచి బయటపడ్డాం. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు, నూనెల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌కు బడ్జెట్‌లో కొత్త శక్తిని అందించాం. భవిష్యత్‌లో పంజాబ్‌లోనూ మా పార్టీ జెండా ఎగురవేస్తాం. కోట్ల మంది మాతృమూర్తులు, మహిళా శక్తే మాకు రక్షణ” అని మోదీ అన్నారు.