UP Elections Results 2022: యోగి ఆదిత్యనాథ్ వైపే మొగ్గుచూపుతున్న సర్వేలు, మళ్లీ యూపీలో బీజేపీదే అధికారమంటున్న ఎగ్జిట్ పోల్స్, 403 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన కౌంటింగ్
గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (UP Elections Results 2022) ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Lucknow, March 10: ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (UP Elections Results 2022) ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రం అత్యధిక అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కలిగి ఉంది. 403 అసెంబ్లీ, 80 లోక్‌సభ స్థానాలు యూపీ సొంతం. అందుకే ఈ రాష్ట్రంలో విజయం సాధించిన పార్టీ కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఈ నేపథ్యంలోనే యూపీలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి దేశం మొత్తం ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా (Uttar Pradesh Assembly Election Results 2022) ఎదురుచూస్తుంటుంది. ఇక 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఈ రాష్ట్రంలో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది కేవలం 47 సీట్లకు పరిమితమైన బీజేపీ 2017లో ఏకంగా 312 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. దీంతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను సీఏం పీఠంపై కూర్చొబెట్టింది.
అటు అంతకుముందు అధికారంలో ఉన్న అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) 224 స్థానాల నుంచి కేవలం 47 స్థానాలకే పరిమితమైంది. మాయవతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్‌పీ) కూడా 80 స్థానాల నుంచి 19 స్థానాలకు పడిపోయింది. రెండేళ్ల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ 62 స్థానాలు కైవసం చేసుకుని తనకు తిరిగేలేదని మరోసారి నిరూపించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా వ్యూహం బాగా పని చేయడంతో బీజేపీకి ఎదురులేకుండా పోయింది.
ఇక 2017 ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా చాలా వరకు నిజం అయ్యాయి. ముఖ్యంగా దైనిక్ భారత్(309), టూడేస్ చాణక్య(285), యాక్సిస్(251-279) వంటి పోలింగ్ ఏజెన్సీలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసలు ఫలితం 312కు దగ్గరగా రావడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే 2017లో బీజేపీ హవా కొనసాగింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్ పోల్ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది.
గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్‌పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని బుధవారం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఆరోపణలకు దిగింది. ‘ ట్యాంపరింగ్‌ను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయా? ఈ విషయంలో ఈసీ వివరణ ఇవ్వాల్సిందే’ అని ఎస్పీ ట్వీట్‌చేసింది. దీంతో మంగళవారం రాత్రి ఈవీఎంలను తరలించిన ఘటనలో వారణాసి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ నళినికాంత్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.