Uttarakhand Assembly Election Results 2022: బీజేపీ, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ, 70 అసెంబ్లీ స్థానాలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం
కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Dehradun, March 10: ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నా ఇతర పార్టీలు ఎన్ని ఓట్లు సాధిస్తాయన్న దానిపై వాటి గెలుపు ఆధారపడిందని చెప్పొచ్చు. గత నాలుగు ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీ మూడో పార్టీగా ఓట్లను చీలుస్తూ వచ్చింది. కానీ 2017 ఎన్నికల నాటికి ఆ పార్టీ ఓటు షేర్ 33 నుంచి 20 శాతానికి పడిపోయింది. ఈసారి ఎన్నికల్లో ఆప్ ఆ పాత్ర పోషించి అధికంగా ఓట్లు రాబడుతుందన్న విశ్లేషణలున్నాయి.
హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి గట్టెక్కేందుకు పరిస్థితులు అంత సులభంగా లేనట్టు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ గతంలో కంటే మరింత పుంజుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 70 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్ర అసెంబ్లీకి ఫిబ్రవరి 16, 23 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు కావాలి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46.5 శాతం, కాంగ్రెస్ 33.5 శాతం ఓట్లు సాధించాయి. బీఎస్పీ 7 శాతం ఓట్లు సాధించాయి.
కాగా, తాజా ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉన్నప్పటికీ ఈసారి ఆప్ కూడా రంగంలోకి దిగడంతో రసవత్తరంగా మారింది. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామి బీజేపీని ఒడ్డున పడేస్తారా? లేక కాంగ్రెస్ కమలానికి షాకిస్తుందా తేలాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.