Assembly Elections 2021 Phase 1: బెంగాల్ కోట ఎవరిది? అస్సాంలో పాగా వేసేదెవరు, బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు తొలి దశలో ప్రారంభమైన పోలింగ్, సాయంత్రం ఆరుగంటల వరకు ఓటింగ్
తూర్పు భారతదేశంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్లోనూ, పక్కనే ఉన్న అసోంలోనూ (Assam Phase 1) శనివారం తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరుగంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది.
New Delhi, Mar 27: తూర్పు భారతదేశంలో ఉన్న అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన బెంగాల్లోనూ, పక్కనే ఉన్న అసోంలోనూ (Assam Phase 1) శనివారం తొలిదశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. బెంగాల్‌లో 30, అస్సాంలో 47 స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరుగంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. కోవిడ్–19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ పోలింగ్ కేంద్రం దగ్గర థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. శానిటైజర్లు ఉంచారు. పరీక్షలో ఎవరికైనా జ్వరం ఉందని తేలితే వారిని సాయంత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు.ఓటర్లందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి తీరాలన్న నిబంధనలున్నాయి.
బెంగాల్‌లో హ్యాట్రిక్ కొట్టాలన్న ఉత్సాహంలో తృణమూల్ కాంగ్రెస్, తూర్పున పాగా వెయ్యాలన్న వ్యూహంలో బీజేపీ నిలవడంతో హోరాహోరీ పోరు (West Bengal Assembly Elections 2021 Phase 1) నెలకొంది. 2016 ఎన్నికల్లో టీఎంసీ ఈ 30 స్థానాలకు గాను 26 సీట్లలో గెలుపొందింది. అయితే గత అయిదేళ్లలో ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు బిగించి అధికారపక్షానికి సవాల్ విసురుతోంది. బీజేపీ నేత సువేందు అధికారి సొంత జిల్లా మేదినిపూర్ జిల్లాలో పోలింగ్ (West Bengal Assembly Election 2021) జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటి దశలో పోలింగ్ జరుగుతున్న 47 స్థానాల్లో 23 మంది మహిళలు సహా మొత్తం 264 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
టీఎంసీ, బీజేపీలు 29 స్థానాల్లో అభ్యర్థుల్ని బరిలో నిలిపితే, లెఫ్ట్–కాంగ్రెస్–ఐఎస్‌ఎఫ్ కూటమి మొత్తం 30 స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేపథ్యంలో అస్సాం అసెంబ్లీ పోరు రసవత్తరంగా మారింది. అధికారాన్ని కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాలను రచించిన బీజేపీ–ఏజీపీ కూటమికి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, లోకల్ కార్డుతో కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్‌ల నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. గత ఎన్నికల్లో బీజేపీ–ఏజీపీలు 47 స్థానాలకు గాను 35 సీట్లలో గెలుపొందాయి.
తూర్పు భారతాన బీజేపీ ఇప్పటివరకు ఒడిషా, బెంగాల్ లో విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ కమలనాథులకు కీలకంగా మారింది. బెంగాల్లో మొత్తం 294 సీట్లకుగాను 65 నియోజకవర్గాల్లో మైనారిటీ ఓట్లు ఎక్కువ. రాష్ట్ర ఓటర్లలో మూడో వంతు ముస్లింలే. ఇన్నాళ్లూ వీరంతా మమత పార్టీకి మద్దతుగా నిలిచారు. ఈసారి బరిలో అబ్బాస్ సిద్దిఖి నేతృత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎ్‌సఎ్‌ఫ)తో పాటు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఏ కూడా పోటీచేస్తుండడం, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకూ మైనారిటీ ఓట్లలో షేర్ ఉండడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది.
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన జంగల్‌మహల్‌లో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతమై జర్‌గ్రామ్ జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్ దగ్గర 11 మంది పారామిలటరీ సిబ్బంది మోహరించినట్టుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు. 1307 పోలింగ్ బృందాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించి 127 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. పురూలియాలో 185 కంపెనీలు, పూర్వ మేదినీపూర్‌లో 148 కంపెనీలు, బంకూరాలో 83 కంపెనీల బలగాలు మోహరించాయి. ఒక్కో కంపెనీలో వంద మంది సిబ్బంది ఉంటారు. రాష్ట్రానికి చెందిన 22 వేల మందికిపైగా పోలీసు సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో ఉన్నారు.
అసోంలో ముఖ్యమంత్రి శర్వానంద సొనొవాల్, స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, పీసీసీ అధ్యక్షుడు రిపున్ బోరా, అనేకమంది మంత్రుల భవితవ్యం శనివారం ఈవీఎంల్లో నిక్షిప్తమవుతుంది. బీజేపీ-ఏజీపీ కూటమికి, కాంగ్రెస్ సారథ్యంలోని 8పార్టీల మహాకూటమికి మధ్యే ప్రధాన పోటీ అయినా కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీ-అసొం జాతీయ పార్టీ(ఏజేపీ), దాని మిత్రపక్షం రైజోర్ దళ్ ఈ రెండు కూటములు అభ్యర్థుల విజయావకాశాలకు గండికొట్టే అవకాశాలున్నా యి.
ఏజేపీ-రైజోర్ దళ్ రెండూ అసొం జాతీయవాదా న్ని ముందుకు తీసుకెళుతున్న పక్షాలు. కాంగ్రెస్ కూటమిలో ఏఐయూడీఎఫ్ ఉండడంతో మెజారిటీ ముస్లిం ఓట్లు ఆ కూటమికి పడే అవకాశం ఉందంటున్నారు. మిగిలినవి ఏజేపీ-- రైజోర్ దళ్ జోలెలో పడతాయని అంచనా. ీఒపీనియన్ పోల్స్ అంచనాల ప్రకారం ప్రస్తుతానికి బీజేపీ కూటమిదే ఆధిక్యం. అయితే కాంగ్రెస్ కూటమి కూడా వెనకబడి లేదు. ఈ దృష్ట్యా హంగ్ ఏర్పడినా ఏర్పడవచ్చని కొన్ని సంస్థల సర్వేల్లో తేలింది.
పశ్చిమబెంగాల్‌లోని 30 స్థానాల్లో కొందరి అభ్యర్థిత్వం ఆసక్తి రేపుతోంది. పురూలియా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదీప్ ముఖర్జీ ఇటీవల బీజేపీ గూటికి చేరుకొని ఎన్నికల బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీ మంత్రి శాంతి రామ్ మెహతా పోటీ పడుతున్నారు. ఖరగ్‌పూర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. దినేన్ రాయ్ (టీఎంసీ), తపన్ భూహియా (బీజేపీ), ఎస్.కె.సద్దామ్ అలీ (సీపీఐఎం) మధ్య గట్టి పోటీ ఉంది.
అస్సాంలో తొలి దశలోనే ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు, ఎందరో విపక్ష నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్ మజూలి నుంచి తిరిగి బరిలో నిలిచారు. కాంగ్రెస్ నేత రజీబ్ లోచన్ పెగు ఈ నియోజకవర్గం నుంచి 2001 నుంచి వరసగా మూడు సార్లు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో సోనోవాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ సారి మళ్లీ వీళ్లిద్దరే తలపడుతున్నారు. జోర్హత్ నుంచి అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ పోటీ పడుతున్నారు.
బెంగాల్, అస్సాంతోపాటు షెడ్యూ ల్ విడుదలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఏప్రిల్ 6న ఒకే దఫాలో పోలింగ్ జరుగనుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)