Shiv Sena MP Sanjay Raut (Photo Credits: ANI)

Mumbai, Mar 22: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఏకంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాంగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కూడా ధీటుగా బదులిస్తోంది. కేంద్ర ఏజెన్సీలను తప్పుదారిలో ఉపయోగించుకుని మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన (President's Rule in Maharashtra) విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) మండిపడ్డారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను అడ్డు పెట్టుకుని, రాష్ట్రంలో అరాచకాలు చేయాలని చూస్తోంది, కలహాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అలా చేయాలని చూస్తే ఆ అగ్నిలో కేంద్రమే కాలిపోతుందని ఆయన హెచ్చరించారు. కాగా భారతీయ జనతా పార్టీ.. మహారాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తోంది. ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ రాసిన లేఖలో దేశ్ ముఖ్ (Home Minister Anil Deshmukh) పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిజెపి ఎంపి నారాయణే రాణే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. "శాంతిభద్రతల పరిస్థితి, అవినీతి కారణంగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా మరియు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నేను హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాను" అని రాణే ANI కి చెప్పారు.

మహారాష్ట్రలో నెలకు వంద కోట్లు వసూలు లేఖ ప్రకంపనలు, రంగంలోకి దిగన శరద్ పవార్, హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌

ఈ విషయమై సోమవారం సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘‘కేంద్ర సంస్థల్ని తప్పుదారిలో వినియోగించుకుంటూ మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం చూస్తున్నట్లయితే నేను మీకో హెచ్చరిక పంపుతున్నాను. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తే రేగే మంటల్లో మీరే కాలిపోతారు’’ అని అన్నారు. కాగా అనిల్ దేశ్ ముఖ్ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తోందని తెలిపారు. సవాలును స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే దీనిని మీరు ఎందుకు పదే పదే లేవనెత్తుతున్నారని రౌత్ మండిపడ్డారు.

ఆరోపణలను విచారించాలని ఎన్‌సిపి చీఫ్ నిర్ణయించినట్లయితే, తప్పేంటి? ఎవరైనా ఏదైనా ఆరోపణలను చేయవచ్చు. దానిపై ప్రభుత్వం దర్యాప్తు జరిపి నిజ నిజాలను వెలికి తీస్తుందని ఆయన తెలిపారు.ఇదిలా ఉంటే కేబినెట్‌లో దేశ్‌ముఖ్ ను కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించడానికి కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపి నాయకులు సోమవారం సమావేశం కానున్నారు.

కొద్ది రోజులుగా మహా మంత్రులపై వరుసగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఒక మంత్రిపై లైంగిక ఆరోపణల కేసు సంచలనం సృష్టించగా, మరో మంత్రిపై హత్యా కేసు రాష్ట్రాన్ని కుదిపివేసింది. తాజాగా హోమంత్రిపై అవినీతి ఆరోపణలు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని రక్షణలోకి నెట్టింది.