NCP chief Sharad Pawar (Photo Credits: ANI)

New Delhi, March 21: పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. రాష్ట్రంలోని శివసేన–ఎన్‌సీపీ–కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఈ కేసు రాజకీయ ప్రకంపనలను పుట్టిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ ఏకంగా రాష్ట్ర హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు (Allegations of Corruption Against Anil Deshmukh) చేశారు. దీనిపై ఆయన ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు ఎనిమిది పేజీల సుదీర్ఘ లేఖ (Param Bir Singh Letter ) రాశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు.

సచిన్‌ వాజేను నెలకు వంద కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ డిమాండ్‌ చేసినట్లు ముంబై పోలీస్ మాజీ క‌మిష‌న‌ర్ పరంబీర్‌ సింగ్‌ శనివారం ఆరోపించారు. ఈ సొమ్మును సీఎం థాకరే పేరిట జమ చేయాలన్నారని చెప్పారు. అనిల్‌ అవినీతి కార్యకలాపాల గురించి ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్, ఉపముఖ్యమంత్రి అజిత్‌లకు తెలిపానని పరంబీర్‌ పేర్కొన్నారు. ‘మంత్రి అనిల్‌ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్‌ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారు. నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ ఆయన్ను పదేపదే మంత్రి కోరారు. రూ.100 కోట్ల ఫండ్‌ కలెక్ట్‌ ఎలా చేయాలో కూడా సచిన్‌ వాజేకు చెప్పారు.

Here's Letter Update

ఎన్సీపీకి చెందిన హోంమంత్రిపై అవినీతి ఆరోపణలు రావడంతో శ‌ర‌ద్ ప‌వార్ (Sharad Pawar Breaks Silence) స్వయంగా రంగంలోకి దిగారు. పార్టీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల‌ను ఢిల్లీకి పిలిచారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ అజిత్ ప‌వార్‌, మంత్రి జ‌యంత్ పాటిల్ ఆదివారం ఢిల్లీ వెళ్లి ప‌వార్‌ను క‌ల‌వ‌నున్నారు. శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ కూడా ఆయనతో భేటీ అవుతారని తెలుస్తున్నది.

మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై పోలీస్ మాజీ క‌మిష‌న‌ర్ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోప‌ణ‌లు తీవ్రమైనవని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ అన్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు, హోంమంత్రిపై చర్యలకు నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం సీఎం ఉద్ధవ్‌ థాకరేకు (CM Uddhav Thackeray) ఉన్నదని తెలిపారు. అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ఈ సమయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వచ్చాయో చూడాల్సి ఉందన్నారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వానికి కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అన్నది తనకు తెలియదని అన్నారు. అయితే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం లేదని చెప్పారు.

ముఖేష్ అంబానీ ఇంటివద్ద కలకలం, కీలక మలుపు తిరిగిన కేసు, మన్సుఖ్ హిరెన్ అనుమానాస్పద మరణంపై మహారాష్ట్ర ఏటీఎస్ ఎఫ్ఐఆర్ నమోదు, ఎన్‌ఐఏ దర్యాప్తును డిమాండ్‌ చేస్తున్న ఫడ్నవిస్

హోంమంత్రి అనిత్ దేశ్‌ముఖ్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు చాలా తీవ్ర‌మైన‌వ‌ని, ఆత్మ విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని రౌత్ స్ప‌ష్టం చేశారు. ఏ మంత్రిపైనా ఇలాంటి విమ‌ర్శ‌లు రాకూడ‌దు. మ‌హారాష్ట్ర‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటుకు ప్ర‌య‌త్నించిన వాళ్లంద‌రికీ ఇది షాక్ అని రౌత్ అన్నారు. దీనిని చాలా మంది లెట‌ర్ బాంబ్‌గా పిలుస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం ఉన్నా.. దీనిపై ముఖ్య‌మంత్రి, ప‌వ‌ర్ సార్ చూసుకుంటారు. అనిల్ దేశ్‌ముఖ్ కూడా స్వ‌యంగా విచార‌ణ కోరారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి అని రౌత్ స్ప‌ష్టం చేశారు.

మ‌హారాష్ట్ర హోంమంత్రిగా అనిల్ దేశ్‌ముఖ్ కొన‌సాగుతార‌ని, ఆయ‌న‌ను మార్చే ప్ర‌స‌క్తే లేద‌ని ఎన్సీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌యంత్ పాటిల్ స్పష్టం చేశారు. ముంబై పోలీస్ మాజీ చీఫ్ ప‌ర‌మ్ బీర్ సింగ్ హోంమంత్రిపై చేసిన ఆరోప‌ణ‌లు నేప‌థ్యంలో దేశ్‌ముఖ్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే ముఖ్య‌మంత్రి, హోంమంత్రి క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న త‌ర్వాతే ఆయ‌న లేఖ రాశాడ‌ని, హోంమంత్రిని మార్చే ప్ర‌శ్నే లేద‌ని జ‌యంత్ పాటిల్ తేల్చి చెప్పారు.

Here's  Jayant Patil Statement

ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌సింగ్‌ లేఖలో ఏముంది ?

మొత్తంగా ముంబైలో 1750 బార్లు, రెస్టారెంట్లు, తదితరాలున్నాయి. ఒక్కో బార్, రెస్టారెంటు నుంచి రూ.2–3 లక్షలు వసూలు చేస్తే నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్లు సులభంగా జమ అవుతాయి. ఇతర వనరుల ద్వారా మిగతా మొత్తం అందేలా చూడాలని మంత్రి కోరారు. ఆ సమయంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పలాండే తదితరులు అక్కడే ఉన్నారు’ అని సీఎంకు రాసిన లేఖలో పరంబీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. తనతోపాటు సీనియర్‌ అధికారులకు తెలియకుండా ఇలా వారిని నివాసానికి పిలిపించుకోవడం, డబ్బులు వసూళ్లు చేసేందుకు టార్గెట్‌ ఇవ్వడం చేస్తుండేవారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనేక కేసుల విచారణలో ఆయన జోక్యం చేసుకునేవారని ఆరోపించారు.

ముంబైలో ఆత్మహత్య చేసుకున్న దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మెహన్‌ దేల్కర్‌ తన సూసైడ్‌ నోట్‌లో అక్కడి అధికారుల తీరుపై పలు ఆరోపణలు చేసినప్పటికీ ఆ కేసును కూడా ముంబై పోలీసులకే అప్పగిస్తూ హోం మంత్రి నిర్ణయం తీసుకోవడాన్ని పరంబీర్‌ సింగ్‌ తప్పుబట్టారు. ముకేశ్‌ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో వాహనం పట్టుబడటం, వ్యాపారి మన్సుఖ్‌ అనుమానాస్పద మృతి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వాజే అరెస్టు పరిణామాల నేపథ్యంలో పరంబీర్‌ను అప్రాధాన్యంగా భావించే హోంగార్డుల విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

 ఆరోపణలపై మంత్రి దేశ్ ముఖ్ సమాధానం

ఈ ఆరోపణలపై మంత్రి దేశ్ ముఖ్ సమాధానం ఇచ్చారు. అవినీతి విషయం ఫిబ్రవరిలోనే తెలిసిన పరంబీర్‌సింగ్‌ ఇప్పటి వరకు మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మంత్రి అనిల్‌ ప్రశ్నించారు. ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని తెలిపారు. తనను తాను కాపాడుకునేందుకే పరంబీర్‌ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘వాహనం కేసు, మన్సుఖ్‌ హత్య కేసులతో వాజేకు సంబంధాలున్నట్లు ఇప్పటికే రుజువైంది. ఇక మిగిలింది పరంబీర్‌. ఇవన్నీ చివరికి ఆయనకే చుట్టుకుంటాయి. కేసు దర్యాప్తు కొనసాగుతోంది కదా’అని పేర్కొన్నారు.

తాజాగా మరొక మృతదేహం

ఇదిలా ఉంటే అంబానీ ఇంటి దగ్గర స్కార్పియో కేసులో అనుమానాస్పద స్థితిలో వాహన యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ శవమై తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరొక మృతదేహం లభించింది. అంబానీ ఇంటి వద్ద కలకలానికి ఈ మృతదేహానికి సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు లభించిన కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేస్తున్నాయి. ముంబైకి సమీపంలోని చిన్న కాలువ దగ్గర స్కార్పియో యజమాని మృతదేహం లభించిన చోటే తాజాగా శనివారం ఓ మృతదేహం లభ్యమైంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు 48 ఏళ్ల షేక్‌ సలీమ్‌ అబ్దుల్‌ అని గుర్తించారు. రేతి బందర్‌ ప్రాంతంలో నివసించే సలీమ్‌ కూలీ పని చేసేవాడని తెలుసుకున్నారు. సముద్రపు ఒడ్డున నిద్రించి ఉన్నప్పుడు నీటిలో పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతడు ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని ముంబ్రా పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

కాగా మన్సూఖ్ కేసులో దర్యాప్తు చేస్తున్న యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేశారు.మాజీ కానిస్టేబుల్ వినాయక్ షిండే (55), బుకీ నరేశ్ లను అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ వర్గాలు తెలిపాయి. ఈ కేసుతో సంబంధం ఉందని భావించి తొలుత వీరిద్దరినీ ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి విచారణ నిమిత్తం పిలిపించారు. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరినీ అరెస్ట్ చేశారు. మాజీ కానిస్టేబుల్ షిండే ఓ నకిలీ కాల్పుల ఘటనలో దోషిగా తేలాడు. ప్రస్తుతం పెరోల్ పై బయట ఉన్నాడు.