Telangana Floods: తెలంగాణలో వరదలకు 16 మంది మృతి, బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం ప్రకటించిన ప్రభుత్వం, మంత్రులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన
రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
Hyd, Sep 2: తెలంగాణలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి బాధితులను పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు. కాసేపటి క్రితమే పాలేరు రిజర్వాయర్‌ను పరిశీలించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమైన సందర్భం... భారీ వర్షం... వరద మీ జీవితల్లో విషాదాన్ని తెచ్చిపెట్టింది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితుల కుటుంబాలకు అందుబాటులో ఉండి కష్టాలను గట్టెక్కించే బాధ్యత తమదేనన్నారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు రూ.10వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
అనంతరం ఆయన ప్రాణ, ఆర్థిక నష్టానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పాడి పశువులు, గొర్రెలు, మేకలు నష్టపోయిన వారికి ఆర్థిక సాయం ఇస్తామన్నారు. వరదల్లో ధృవపత్రాలు పోగొట్టుకున్న వారికి మళ్లీ ఒరిజినల్స్ ఇస్తామని వెల్లడించారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వరద నష్టాన్ని అంచనా వేయాలని... నష్టం అంచనా నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తామన్నారు. వీడియో ఇదిగో, భారీ వరదలకు నీట మునిగిన ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం, భారీగా పెరుగుతున్న వరద ఉధృతి
వరద బాధితులకు తక్షణ రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించారు. పశువులు మరణిస్తే రూ.50 వేలు... గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేల చొప్పున ఇస్తామన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను నిర్మిస్తామన్నారు. వరదల వల్ల సర్టిఫికెట్లు పోయినవారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. మీ కుటుంబాలకు అందుబాటులో ఉండి మీ కష్టాల నుంచి గట్టెక్కించే బాధ్యత మాది. ఎమ్మెల్యేలు, మంత్రులు మీ నష్టాన్ని అంచనా వేస్తారు. ధైర్యంగా ఉండండి. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఎంత నష్టపోయారో అంచనా వేస్తారు’’ అని సీఎం తెలిపారు.
Here's Videos
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... మంత్రులు, అధికారులు రోజంతా వరద బాధితుల కోసమే కష్టపడుతున్నారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిద్ర లేకుండా శ్రమిస్తున్నారని తెలిపారు. దాదాపు గత డెబ్బై ఏళ్లలో ఇంతటి వర్షాన్ని చూడలేదని పెద్దలు చెబుతుంటే తెలిసిందన్నారు. భారీ వర్షాల వల్ల రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్న వందలాది కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి కొనుకున్న నిత్యావసర వస్తువులు సహా అన్నీ నీటి పాలయ్యాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి బియ్యం, ఉప్పు, పప్పులు, మంచినీరు అందించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద నష్టాన్ని అంచనా వేస్తారన్నారు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ధైర్యం చెప్పారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో రూ.5వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తెలిపారు. కేంద్రం వెంటనే రూ.2వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ఖమ్మం, నల్గొండ పరిస్థితిని ప్రధాని మోదీ, హో మంత్రి అమిత్ షాకు వివరించాం. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధానిని ఆహ్వానించాం. కేంద్రం తక్షణమే తెలంగాణకు రూ.2వేల కోట్లు కేటాయించాలి. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి’’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులతో సమీక్షించినట్లు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఎనిమిది జిల్లాలపై తీవ్ర వర్ష ప్రభావం పడిందన్నారు. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది మృతి చెందారన్న ఆయన.. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
‘‘అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను సమీక్షించాలి. విద్యుత్తు, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని కోరాం. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ రెస్పాన్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తాం. పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేతలు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి’’ అని విజ్ఞప్తి చేశారు.