తెలంగాణలో వర్షం విలయం సృష్టించింది. కుంభవృష్టి కురవడంతో రాష్ట్రంలో జనజీవనం అతలాకుతలమైంది. వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లి గ్రామాలు, కాలనీల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల ముంపు ఏర్పడింది.నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలుచోట్ల సాగునీటి కాలువలు తెగిపోయాయి. చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి.
మహబూబాబాద్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జిల్లా కేంద్రం నీటి మునిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నె-కేసముద్రం స్టేషన్ల మధ్య కిలోమీటరు మేర, మహబూబాబాద్-తాళ్లపూసపల్లి స్టేషన్ల మధ్య సుమారు 300 మీటర్ల మేర ట్రాక్ కోతకు గురైంది. ఈ మార్గంలో 24 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
ఇక మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం వద్ద వరద ఉధృతి పెరిగింది. దాదాపు ఆలయం నీట మునిగిపోయేలా వరదలు ముంచెత్తాయి. వనదుర్గా మాత ఆలయం ముందు నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. గర్భగుడిలో అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు.
Here's Video
మెదక్ - ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం వద్ద వరద ఉధృతి
For More Updates Download The App Now - https://t.co/qmKskeAd4t pic.twitter.com/3vbvy47BRW
— ChotaNews (@ChotaNewsTelugu) September 2, 2024
కాగా, నక్క వాగు వరద మంజీరాలో చేరడంతో వనదుర్గా ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరద నేపథ్యంలో మంజీరాలో జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టువైపు వెళ్లకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.