Maha Politics: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనా? దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఇదే చివరి రోజు, ప్రభుత్వ ఏర్పాటులో రోజుకో మలుపు తిరుగుతున్న 'మహా' రాజకీయాలు

కాలం పరీక్ష పెట్టినపుడు అర్జునుడిలా పోరాడాలి, అంతే కానీ సమస్యలను చూసి పారిపోకూడదు" అని గతంలో అటల్ బిహారీ వాజిపెయి చెప్పిన భగవత్ గీత శ్లోకాన్ని ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు గుర్తు చేస్తూ సంజయ్ రౌత్ గీతోపదేశం...

File Images of Shiv Sena President Uddhav Thackeray with Maharashtra CM Devendra Fadnavis (Photo Credits: IANS)

Mumbai, November 8: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు ( Maharashtra Govt Formation) చేసేది ఎవరు? సీఎం పీఠంపై కూర్చునేది ఎవరు? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. సీఎం పదవిపై శివసేన (Shiv Sena) తగ్గకపోవడంతో కావాల్సిన మెజారిటీ లేక బీజేపీ (BJP)  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతుంది. ఈరోజు అర్ధరాత్రితో మహారాష్ట్ర శాసన సభ పదవీకాలం ముగుస్తుంది. సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) సారథ్యంలోని ప్రభుత్వం మైనారిటీలోకి పడిపోతుంది. కాబట్టి ఈ లోపు ఆయన విశ్వాస పరీక్షలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా నిరూపించుకోని పక్షంలో గవర్నర్ అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఒకసారి రాష్ట్రపతి పాలన  (President Rule) విధించబడితే 6 నెలల్లోపు మరోసారి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పటివరకు ఫడ్నవిస్ అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.

అయితే తన సీఎం పదవిని రక్షించుకోవడానికి దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్రపతి పాలనకే మొగ్గుచూపుతున్నారా? అనే వాదనలు వినవస్తున్నాయి. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఫడ్నవిస్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాష్ట్రపతి పాలన కోరుకోవడం అంటే ఓట్లు వేసిన ప్రజలను అవమానపరచటమే అని వ్యాఖ్యానించారు. అపద్ధర్మ ప్రభుత్వం పేరుతో భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడ వద్దని తెలిపారు. ఫలితాల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ పైనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కావాలంటే, ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆ తర్వాత బల నిరూపణ కోసం ఒక నెల రోజులు సమయం తీసుకోవచ్చునని స్పష్టం చేశారు. "కాలం పరీక్ష పెట్టినపుడు అర్జునుడిలా పోరాడాలి, అంతే కానీ సమస్యలను చూసి పారిపోకూడదు" అని గతంలో అటల్ బిహారీ వాజిపెయి చెప్పిన భగవత్ గీత శ్లోకాన్ని ఈ సందర్భంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కు గుర్తు చేస్తూ సంజయ్ రౌత్ గీతోపదేశం చేశారు.

Sanjay Raut's Tweet

 

అయితే సీఎం పదవిని శివసేనకు ఇచ్చేందుకు సమ్మతమైతేనే బీజేపీ తమన సంప్రదించాలని శివసేన తేల్చిచెపుతుంది. ఇక బీజేపీ- శివసేన మధ్య సయోధ్య కుదిర్చేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ముంబై వచ్చారు. అయితే శివసేన మాత్రం తమ ప్రధాన డిమాండ్ ను వదిలుకునేందుకు సిద్ధంగా లేదని చెబుతుంది. సీఎం పదవిపై స్పష్టమైన హామీ రాకపోతే గడ్కరీ పర్యటనను కూడా సాధారణ పర్యటనగానే పరిగణిస్తామని శివసేన ఇప్పటికే స్పష్టం చేసింది.   శివసేనకు ఘలక్ ఇచ్చిన ఎన్‌సిపి, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేనకు సూచన

ఎన్నికలకు ముందు శివసేన- బీజేపీ కలిసి పోటీ చేశాయి, అలాగే కాంగ్రెస్ - ఎన్‌సీపీ కలిసి పోటీ చేశాయి. కాగా, తాము ఎన్నికలకు ముందుగానీ, ఎన్నికలకు తర్వాత గానీ ఎప్పుడూ కూడా శివసేనకు సీఎం పదవిపై హామి ఇవ్వలేదని బీజేపీ చెప్తూ వస్తుంది. ఒకవేళ శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించకపోతే తాము ఎన్‌సీపీ మద్ధతు కోరే అవకాశాన్ని కొట్టి పారేయలేమని, బీజేపీ సీనియర్ కేబినేట్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా?, శత్రువులు మిత్రులు అవుతారా? అన్న సందేహం వ్యక్తం అవుతుంది. అసలు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా? లేక రాష్ట్రపతి పాలన వైపే అడుగులు పడతాయా? చూడాలి.